ఆత్మహత్యలకు కేరాఫ్‌గా సెంట్రల్ వర్సిటీ
హైదరాబాద్: ప్రొఫెసర్ల వేధింపులతో కొందరు... ప్రేమ విఫలమై మరికొందరు...ఆర్థిక సమస్యలతో ఇంకొందరు.. ఇలా సెంట్రల్ యూనివర్శిటీలోని విద్యార్థులు క్షణికావేశంలో తమ బంగారు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి అటు తల్లిదండ్రులకు.., ఇటు సమాజానికి తీరని వేదన మిగులుస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న మందారి వెంకటేశ్ ఆదివారం ఆత్మహత్య చేసుకోవడంతో వర్సిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు పట్టుదలతో శ్రమిస్తున్నప్పటికీ, మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడం విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల బలవన్మరణాలకు కేంద్రంగా మారుతోంది. అధ్యాపకుల వేధింపులు, ప్రేమ తదితర కారణాలతో ఒత్తిడికిలోనై కొందరు చావే శరణ్యంగా భావిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ఐదురుగు పరిశోధక విద్యార్థులు కాగా మరో ఇద్దరు పీజీ విద్యార్థులున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలు..
ప్రేమ విఫలమై...
* 2006లో: ఆశిన్‌దావన్ 2007లో: కేశవాచారి, 2007లో: సునీత, 2012లో: స్వాతిరాణి, 2012లో: స్వరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా ప్రేమవిఫలమై ఆత్మహత్య చేసుకున్నారు.
వేధింపులతో...
* 2008లో: సెంథిల్‌కుమార్, 2009 బాలరాజు, 2012లో: నరేష్‌కుమార్‌రెడ్డి, 2013 మార్చిలో: పుల్యాల రాజు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు డిపార్ట్‌మెంట్ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
* 2013 ఆగస్టులో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిని మోహినీ మిశ్రా అనుమానాస్పదస్థితిలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి మృతి చెందింది.