పిచ్చుక.. తిరిగి రావాలిక..
జీవవైవిధ్యానికి ప్రతీకలు చిట్టి పక్షులు
ఊరపిచ్చుకలపై ప్రత్యేక లెక్కింపు
నేచర్ ఫరెవర్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వే
రేపు అంతర్జాతీయ ఊరపిచ్చుకల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, వాకిళ్లు, కిటికీలు, వెంటిలేటర్లు, కారిడార్లలో వాలి కిచకిచమంటూ సందడి చేస్తాయి. అక్కడక్కడా చెట్ల కొమ్మలపైన వాలి కనువిందు చేస్తాయి. చిన్న చిన్న రెక్కలను టపటపలాడిస్తూ పిల్లలతో దోబూచులాడుతాయి. నిత్యం మనల్ని పలకరించే ఆ చిన్ని జీవులు.. పిచ్చుకలు.. జీవవైవిధ్యానికి ప్రతీకలైన ఊరపిచ్చుకలు క్రమంగా మనుగడను కోల్పోతున్నాయి. నగరీకరణ, ఫ్లాట్ కల్చర్, రేడియేషన్ వంటివి వాటి ఉనికికి విఘాతం కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో ఊరపిచ్చుకలతోపాటు 40 రకాల పక్షులే ఉన్నాయి.
అంతర్జాతీయ ఊరపిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకల అధ్యయనానికి శ్రీకా రం చుట్టింది నేచర్ ఫరెవర్ సొసైటీ. అంతా ఇందులో పాల్గొని తమ ఇళ్లు, పరిసరాల్లో కనిపించే పక్షుల వివరాల ను ఆ సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని పిలుపునిచ్చింది. తద్వారా ఊరపిచ్చుకల సంఖ్యను అంచనా వేయడంతో పాటు, అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు అవసరమనే అంశంపై సంస్థ దృష్టి సారించనుంది. ‘వరల్డ్ స్పారో డే’ (మార్చి 20) సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం ఇది.
ప్రమాద ఘంటికలు...
ఒక నిశ్శబ్దమైన మార్పు. మూడు దశాబ్దాల కిందట నగరంలో ఊరపిచ్చుకలు పుష్కలంగా ఉండేవి. పెరిగిన అపార్ట్‌మెంట్లు వాటి మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. మరోవైపు మొబైల్ టవర్స్ నుంచి వెలువడే అత్యధిక రేడియేషన్ కూడా వీటి ఉనికిని దెబ్బతీసింది. హైదరాబాద్ వంటి నగరాల్లో మనుగడ కోసం జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా గత 20 ఏళ్లలో 50 శాతానికి పైగా అంతరించినట్లు ‘నేచర్ ఫరెవర్ సొసైటీ’ప్రతినిధి రమాదేవి మీనన్ ‘సాక్షి’తో చెప్పారు. గత 5 ఏళ్లుగా ఆమె చేపట్టిన ఉద్యమం వల్ల సికింద్రాబాద్, మారేడుపల్లి, కార్ఖానా, సిక్‌విలేజ్, పికెట్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఊరపిచ్చుకలు పెరిగాయి. ఆమె స్వయంగా వందలాది గూళ్లను, నీటి బౌల్స్‌ను, గింజలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ‘‘మేం మారేడుపల్లికి వచ్చినప్పుడు ఒక్క పిట్ట కూడా లేదు. ఇప్పుడు మా ఇంటి చుట్టూ 500కి పైగా కనిపిస్తున్నాయి’’అని సంతోషం వ్యక్తం చేశారు.
సర్వే ఇలా...
నేచర్ ఫరెవర్ సొసైటీ ఈ ఏడాది ఊరపిచ్చుకుల సంరక్షణ కోసం ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టింది. 20వ తేదీ వరకు అందరూ తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో 15 నిమిషాల పాటు బర్డ్‌వాచ్ చేయాలి. ఆ సమయంలో కనిపించే పక్షుల వివరాలను www.worldsparrowday.org అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఈ సర్వే ద్వారా లభించిన వివరాలతో ఎక్కడ ఏ రకమైన పక్షులు ఉన్నాయి. ఊరపిచ్చుకల మనుగడ ఎలా ఉంది అనే అంశంపైన సమగ్రమైన అవగాహన లభిస్తుంది. వాటి సంరక్షణ కోసం చేపట్టవలసిన చర్యలు కూడా కచ్చితంగా అంచనా వేయవచ్చునని సంస్థ వ్యవస్థాపకుడు మహ్మద్ దిలావర్ చెప్పారు.
అతిథుల్లా ఆదరించండి...
► బాల్కనీల్లో, ఇంటి నీడల్లో కనిపించే పక్షులను చేరదీసి వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేయాలి.
► చిన్న నీటి తొట్టెల్లో నీటిని అందుబాటులో ఉంచాలి.
► కాలనీల్లో, ఖాళీస్థలాల్లో పక్షుల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలి.