sparrow day
-
World Sparrow Day 2023: పిచ్చుకల జీవిత కాలమెంతో తెలుసా?
వేకువ జామున కిలకిలారావాలతో మేలుకొలుపు పాడే పిచ్చుకలను చూస్తే మనసుకు కాసింత హాయి.. చూరుకు వేలాడదీసిన వరి కంకులు తింటూ ‘కిచ కిచ’ మంటూ గోల చేసే చిట్టి పిట్టలు కలిగించే ఉత్సాహం మాటల్లో చెప్పలేం.! ఇసుక, మట్టిలో పొర్లాడే దృశ్యాలు.. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ పిట్టలు సందడి చేసిన క్షణాలు ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు. మనిషికి దగ్గరగా ఉంటూ మన కుటుంబంలో ఒకరుగా ఉన్న పిచ్చుకలు.. మానవజాతి చేస్తున్న తప్పిదాలకు బలైపోతున్నాయి. ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న పక్షుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న పిచ్చుకలను రక్షించుకోకపోతే జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాటి విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పూర్వం మధ్యదరా ప్రాంతంలో ఆవాసముండే పిచ్చుకలు కాలక్రమంలో ప్రపంచమంతటా విస్తరించాయి. అడవుల్లో కాకుండా మానవులకు దగ్గరగా ఉండేందుకే అవి ఇష్టపడతాయి. గూడుకు ముప్పు వస్తుందనుకుంటే ఇతర జాతుల పక్షులపై దాడి చేసేందుకూ వెనుకాడవు. మగ, ఆడ పిచ్చుకలు అదే వర్గానికి చెందిన పక్షులపై మాత్రమే దాడి చేయడం ఇక్కడ విశేషం. ►65 ఏళ్ల క్రితం అంటే 1958లో చైనా పాలకుడు మావో జెడాంగ్ పిచ్చుకలపై బ్రహ్మస్త్రం సంధించాడు. పంటలు నాశనం చేస్తున్నాయనే నెపంతో లక్షల సంఖ్యలో పిట్టలను కాల్చిపడేయించాడు. పంటల వద్ద పళ్లేలతో చైనీయులు చేసిన శబ్ధాల ధాటికి పిచ్చుకలు బతుకుజీవుడా అనుకుంటూ దూరంగా వెళ్లి తలదాచుకున్నాయి. ►ఆ తర్వాత పంటలను చీడపీడలు ఆశించడంతో తిండిగింజలు కరువయ్యాయి. రెండేళ్లలోనే తాము చేసిన తప్పు చైనీయులకు తెలిసొచ్చింది. పిట్టలు బతికుంటేనే పంటకు రక్ష అని గుర్తించిన చైనీయులు వాటిని సంరక్షించడం మొదలుపెట్టారు. జీవవైవిధ్యానికి పిచ్చుకలు ఎంతలా దోహదపడతాయో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ. ఖండాలు దాటి వచ్చే చిన్ని పిచ్చుక.. ►చూడటానికి పిచ్చుకల్లా ఉండే ఈ పక్షులు ఏటా శీతాకాలంలో పశ్చిమ దేశాల నుంచి నల్లమల అభయారణ్యానికి లక్షల సంఖ్యలో వలస వస్తుంటాయి. వీటితోపాటు వలస వచ్చే హారియర్స్ అనే గద్ద జాతి పక్షులు గ్రేటర్ షార్ట్ టోడ్ లార్క్లను వేటాడి తింటాయి. ►పిచ్చుకలు అంతరించిపోతుండటానికి కారణాలు అనేకం. భూతాపోన్నతి నుంచి రక్షణ కోసం మానవ జాతి వినియోగిస్తున్న అన్లెడెడ్ పెట్రోల్ అందులో ఒకటి. ఈ పెట్రోల్‌ను మండించినప్పుడు విడుదలయ్యే మిౖథెల్ నైట్రేట్.. చాలారకాల క్రిమికీటకాలకు విషంలా మారుతోందని, ఫలితంగా పిచ్చుకలకు ఆహారం దొరకకుండా పోతోందని ఆర్నితాలజిస్టులు(పక్షి శాస్త్రవేత్తలు) తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. ►పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ శైలి మారడంతో పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశాలు తగ్గాయి. పెరటి తోటలు అంతంతమాత్రంగా ఉండటం, వాహనాల రణగొణధ్వనులు, సెల్ టవర్ల రేడియేషన్, పంటల సాగులో రసాయనాలు అధికంగా వినియోగించడం తదితర కారణాలు పిచ్చుకల జీవనానికి ముప్పుగా పరిణమించాయి. ►ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ తయారు చేసిన రెడ్‌లిస్ట్ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. మన దేశంలోనూ పిచ్చుకల్ని సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ►పిచ్చుకల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు. ► బరువు 35 నుంచి 40 గ్రాములు. ►ఎగిరే వేగం గంటకు 38.5 నుంచి 50 కి..మీ. ►ఐదు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. 10 నుంచి 15 రోజుల్లో పొదుగుతాయి. ►ప్రత్యర్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలో ఈదగలదు. ►ఆడ పిచ్చుకల్ని ఆకర్షించేందుకు మగ పిచ్చుకలే గూళ్లు కడతాయి. -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
పిచ్చుక.. తిరిగి రావాలిక..
జీవవైవిధ్యానికి ప్రతీకలు చిట్టి పక్షులు ఊరపిచ్చుకలపై ప్రత్యేక లెక్కింపు నేచర్ ఫరెవర్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వే రేపు అంతర్జాతీయ ఊరపిచ్చుకల దినోత్సవం సాక్షి, హైదరాబాద్: ఇళ్లు, వాకిళ్లు, కిటికీలు, వెంటిలేటర్లు, కారిడార్లలో వాలి కిచకిచమంటూ సందడి చేస్తాయి. అక్కడక్కడా చెట్ల కొమ్మలపైన వాలి కనువిందు చేస్తాయి. చిన్న చిన్న రెక్కలను టపటపలాడిస్తూ పిల్లలతో దోబూచులాడుతాయి. నిత్యం మనల్ని పలకరించే ఆ చిన్ని జీవులు.. పిచ్చుకలు.. జీవవైవిధ్యానికి ప్రతీకలైన ఊరపిచ్చుకలు క్రమంగా మనుగడను కోల్పోతున్నాయి. నగరీకరణ, ఫ్లాట్ కల్చర్, రేడియేషన్ వంటివి వాటి ఉనికికి విఘాతం కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో ఊరపిచ్చుకలతోపాటు 40 రకాల పక్షులే ఉన్నాయి. అంతర్జాతీయ ఊరపిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకల అధ్యయనానికి శ్రీకా రం చుట్టింది నేచర్ ఫరెవర్ సొసైటీ. అంతా ఇందులో పాల్గొని తమ ఇళ్లు, పరిసరాల్లో కనిపించే పక్షుల వివరాల ను ఆ సంస్థ వెబ్సైట్లో నమోదు చేయాలని పిలుపునిచ్చింది. తద్వారా ఊరపిచ్చుకల సంఖ్యను అంచనా వేయడంతో పాటు, అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు అవసరమనే అంశంపై సంస్థ దృష్టి సారించనుంది. ‘వరల్డ్ స్పారో డే’ (మార్చి 20) సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం ఇది. ప్రమాద ఘంటికలు... ఒక నిశ్శబ్దమైన మార్పు. మూడు దశాబ్దాల కిందట నగరంలో ఊరపిచ్చుకలు పుష్కలంగా ఉండేవి. పెరిగిన అపార్ట్మెంట్లు వాటి మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. మరోవైపు మొబైల్ టవర్స్ నుంచి వెలువడే అత్యధిక రేడియేషన్ కూడా వీటి ఉనికిని దెబ్బతీసింది. హైదరాబాద్ వంటి నగరాల్లో మనుగడ కోసం జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా గత 20 ఏళ్లలో 50 శాతానికి పైగా అంతరించినట్లు ‘నేచర్ ఫరెవర్ సొసైటీ’ప్రతినిధి రమాదేవి మీనన్ ‘సాక్షి’తో చెప్పారు. గత 5 ఏళ్లుగా ఆమె చేపట్టిన ఉద్యమం వల్ల సికింద్రాబాద్, మారేడుపల్లి, కార్ఖానా, సిక్‌విలేజ్, పికెట్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఊరపిచ్చుకలు పెరిగాయి. ఆమె స్వయంగా వందలాది గూళ్లను, నీటి బౌల్స్‌ను, గింజలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ‘‘మేం మారేడుపల్లికి వచ్చినప్పుడు ఒక్క పిట్ట కూడా లేదు. ఇప్పుడు మా ఇంటి చుట్టూ 500కి పైగా కనిపిస్తున్నాయి’’అని సంతోషం వ్యక్తం చేశారు. సర్వే ఇలా... నేచర్ ఫరెవర్ సొసైటీ ఈ ఏడాది ఊరపిచ్చుకుల సంరక్షణ కోసం ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టింది. 20వ తేదీ వరకు అందరూ తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో 15 నిమిషాల పాటు బర్డ్‌వాచ్ చేయాలి. ఆ సమయంలో కనిపించే పక్షుల వివరాలను www.worldsparrowday.org అనే వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ సర్వే ద్వారా లభించిన వివరాలతో ఎక్కడ ఏ రకమైన పక్షులు ఉన్నాయి. ఊరపిచ్చుకల మనుగడ ఎలా ఉంది అనే అంశంపైన సమగ్రమైన అవగాహన లభిస్తుంది. వాటి సంరక్షణ కోసం చేపట్టవలసిన చర్యలు కూడా కచ్చితంగా అంచనా వేయవచ్చునని సంస్థ వ్యవస్థాపకుడు మహ్మద్ దిలావర్ చెప్పారు. అతిథుల్లా ఆదరించండి... ► బాల్కనీల్లో, ఇంటి నీడల్లో కనిపించే పక్షులను చేరదీసి వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేయాలి. ► చిన్న నీటి తొట్టెల్లో నీటిని అందుబాటులో ఉంచాలి. ► కాలనీల్లో, ఖాళీస్థలాల్లో పక్షుల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలి.