మహిళా మేలుకో! | special story on women empowerment | Sakshi
Sakshi News home page

మహిళా మేలుకో!

Published Sun, Feb 11 2018 9:26 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

special story on women empowerment - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశ్వనగరంలోనూ భద్రత కరువే అన్ని రంగాల్లోనూ రెండో స్థానంలోనే మహిళలు ఆధునికత ఓ వైపు..అకృత్యాలు మరోవైపుఇంకా కొనసాగుతున్న వరకట్న వేధింపులు ఐటీ నుంచి అడ్డా కూలీ వరకు అంతటా వివక్షే.. వేతనాల్లోనూ భారీ వ్యత్యాసం యథేచ్ఛగా లింగనిర్ధారణ, భ్రూణ హత్యలు గృహ హింసపై ఏటా 14 వేల కేసులు నమోదు భరోసా ఇవ్వని కఠిన చట్టాలు హైదరాబాద్‌ అంతర్జాతీయ మహానగరంగా ఘనకీర్తిని అందుకుంది. మొత్తం ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది. వందల ఏళ్ల క్రితమే నగరంలో మొదలైన మానవ ప్రస్థానం, వికసించిన నాగరికత హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దాయి. అలాంటి నాగరిక నగరంలో మహిళల రక్షణ ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అడుగడుగునా రాజ్యమేలుతున్న అభద్రత, ఆధిపత్యం, వేతనాల్లో భారీ వ్యత్యాసాలు, సమాన హోదా, సమాన హక్కులకు చోటులేని సామాజిక జీవనం సవాళ్లు విసురుతున్నాయి.

విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ అతివల అభ్యున్నతిలో మాత్రం వెనుకడుగే వేస్తోంది. అనేక రంగాల్లో మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. కానీ సమాజంలోని పురుషాధిపత్య భావజాలంలో, విలువల్లో ఆశించిన మార్పులు రానందున ఇప్పటికీ మగాడి చేతుల్లో హింస ఒక ఆయుధంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో మహిళల     సాధికారత.. భద్రత..వివక్ష.. విజయాలు.. అపజయాలపై నేటి నుంచి ‘సాక్షి’ స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది. ప్రత్యేక కథనాలు అందిస్తోంది. మరోవైపు కష్టాలకు ఎదురొడ్డి..ఆత్మ విశ్వాసంతో ఆయా రంగాల్లో విజయం సాధించిన నగర మహిళల గాథలు..

గ్రేటర్‌ జనాభా సుమారు కోటికి చేరువైంది. ఇందులో 40 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 929 మంది ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ, ప్రైవేట్, సంఘటిత, అసంఘటిత రంగాల్లో లక్షలాది మంది మహిళలు తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. మహానగర అభివృద్ధిలో భాగమవుతున్నారు. నగరంలో సుమారు 850 ఐటీ పరిశ్రమల్లో 4.5లక్షల మంది ఐటీ నిపుణులుంటే, వారిలో 35శాతం వరకు మహిళలున్నారు. విధానాల రూపకల్పన, అమల్లోనూ మహిళా అధికారులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగానూ రాణిస్తున్నారు. అయితే వివిధ రంగాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, వాటిని అందుకోవడంలో పురుషాధిపత్యం ప్రతిబంధకంగానే ఉంది. పెళ్లికి ముందు ఐటీ నిపుణులుగా గొప్ప ప్రతిభను చూపిన అమ్మాయిలు... వివాహానంతరం ఇళ్లకే పరిమతమవుతున్నారు.  విశాలమైన ప్రపంచంలోంచి ఇరుకైన చట్రంలోకి జారిపోతున్నారు. ఇదంతా నగరంలో మహిళల స్థానాన్ని ప్రతిబింబిస్తోంది.  

సిటీలోనూ భ్రూణ హత్యలు...
నిజానికి మహిళలపై హింస... అత్యంత అమానవీయమైన లింగనిర్ధరణ పరీక్షలతోనే మొదలవుతోంది. బలమైన చట్టాలున్నప్పటికీ సిటీలోనూ లింగనిర్ధరణ పరీక్షలు, భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సమాజంలో అమ్మాయిలకు భద్రత ఉండదనే ఒకే ఒక్క కారణంతో... చాలామంది అమ్మాయిలను కనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకూ భయపడుతున్నారంటే ఇంటా, బయటా హింస ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గృహహింస వ్యతిరేక చట్టం వంటివి వచ్చినప్పటికీ వరకట్న, అత్తింటి వేధింపులను ఎదురించేందుకు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు.   

ఏటా 14వేల కేసులు...
మహిళా భద్రతా కమిటీ అనేక రక్షణ చర్యలు చేపట్టింది. సిటీ బస్సుల్లో పార్టీషన్‌ డోర్‌లు ఏర్పాటు చేసింది. షీ బృందాలు రంగంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో సీసీ కెమెరాల నిఘా ఉంది. అయినప్పటికీ మహిళా ఉద్యోగులు నిర్భయంగా, ఆత్మస్థ్యైంతో తిరగలేకపోతున్నారు. ఒంటరి ప్రయాణమంటేనే భయపడుతున్నారు. సోషల్‌ మీడియా సైతం మహిళల భద్రతకు సవాళ్ల విసురుతోంది. నగరంలో వివిధ రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసపై ఏటా సగటున 12వేల నుంచి 14వేల కేసులు నమోదువుతున్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు  వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నవాళ్లు, మౌనంగా హింస, ఈవ్‌టీజింగ్‌ను భరిస్తున్నవాళ్లు ఇంకా  ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరోవైపు నిందితుల అరెస్టు, కోర్టు విచారణ, చార్జిషీట్‌ దాఖలు, శిక్షల అమలు నత్తనడకన సాగుతుండడం మహిళలను నిరాశకు గురి చేస్తోంది. మహిళలకు న్యాయం జరిగే విషయంలో  న్యాయమూర్తుల కొరత కూడా ఒక సమస్య. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి 10లక్షల జానాభాకు 150మంది న్యాయమూర్తులుంటే.. మన దగ్గర కనీసం 15మంది కూడా లేకపోవడంతో మహిళలకు న్యాయస్థానాల్లోనూ న్యాయం దక్కడం లేదు. కేసుల విషయంలో విపరీతంగా జాప్యం జరుగుతోందని న్యాయనిపుణులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.  

అడ్డా కూలీల్లోనూ వివక్షే...
బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో నగరంలోని అనేక కూడళ్లు వలస కూలీల అడ్డాలుగా మారాయి. ఒక అంచనా ప్రకారం నగర జనాభాలో 40లక్షలకు పైగా ఉపాధి కోసం వచ్చినవాళ్లే. వీరిలో సుమారు 15లక్షల మంది మహిళలు. వీరంతా నిర్మాణ రంగం, అసంఘటిత పారిశ్రామిక కార్మికులుగా కొనసాగుతున్నారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, ఉప్పల్, నాచారం, చర్లపల్లి తదతర పారిశ్రామిక ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు పని చేస్తున్నారు. కానీ వేతనాల్లో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మగవారికి ఒక రోజు కూలీ రూ.700 –రూ.1000 వరకు లభిస్తే, మహిళలకు మాత్రం రూ.300–రూ.500.  

ఐటీలోనూ అంతే..?  
ఒక్క అసంఘటిత రంగంలోనే కాదు.. ఐటీ రంగంలోనూ వేతనాల తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే రకమైన పనికి రెండు రకాల వేతనాలు అమలవుతున్నాయి. ఇద్దరూ సాంకేతిక నిపుణులే అయినప్పటికీ పురుషులకు రూ.75వేల వేతనం లభిస్తే, మహిళలకు మాత్రం రూ.50వేలు లభించడంపై ఐటీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతుల్లోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. ఒకే కేడర్‌లో ఉన్నవారికి వేర్వేరు పదోన్నతులు లభించడం మహిళా నిపుణులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది.  

పాతబస్తీలో మారని పరిస్థితి...
ఓవైపు నగరమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే... పాతబస్తీలో మాత్రం ఇంకా నిరక్షరాస్యత, అజ్ఞానం, మూఢనమ్మకాలు మహిళల పాలిట శాపంగానే ఉన్నాయి. చదువుకుంటున్న అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. చిన్నారులు అక్రమ రవాణాకు గురవుతున్నారు. అరబ్‌షేక్‌ల దాష్టీకానికి, అకృత్యాలకు బలవుతున్నారు. మహిళలపై లైంగిక హింస, దోపిడీ, దౌర్జన్యాలను మగవాడు ఒక హక్కుగా భావించే దుర్మార్గమైన పరిస్థితులు నగరాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. ఒక్క పాతబస్తీలోనే కాదు... ఇతర ప్రాంతాల్లోనూ మహిళలపై హింస ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హయత్‌నగర్‌లో ఓ వ్యక్తి కాబోయే భార్యను అనుమానించి  హతమార్చిన సంఘటన, తనను ప్రేమించడం లేదని లాలాగూడలో ఓ యువతిని గొంతుకోసి చంపేసిన దుర్మార్గుడి ఉదంతం, జిల్లెలగూడవాసి హరీష్‌ తనను ప్రశ్నించినందుకు భార్యను, పిల్లలను గొంతునులిమి చంపిన ఘటనలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. మరోవైపు వివాహేతర సంబంధాల్లోనూ మహిళలు  
బలవుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement