
'నా వాళ్లకు అండగా ఉండాలనే సిరియా బయల్దేరా'
సిరియాలో ఉన్న తన వర్గం వారికి అండగా నిలిచేందుకే తాను అక్కడకు బయల్దేరినట్లు పోలీసులు అరెస్టు చేసిన సల్మాన్ మొయినుద్దీన్ వెల్లడించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు అతడు వెళ్లబోతుండగా, శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని శంషాబాద్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకోనున్నారు. పోలీసుల విచారణలో ఐఎస్ఐఎస్పై మరిన్ని వివరాలను మొయినుద్దీన్ వెల్లడించాడు. తాను విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లాలనుకున్నానని, అక్కడ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత సిరియా వెళ్లాలని భావించానని చెప్పాడు.
ఐఎస్ఐఎస్ కోసం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు అమెరికన్ అధికారులు గుర్తించారని, తాను దుబాయ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా, వీసా గడువు కూడా పొడిగించకుండా ఇండియాకు తిప్పి పంపేశారని మొయినుద్దీన్ చెప్పాడు. దౌలానా న్యూస్ అనే ఫేస్బుక్ అకౌంట్లో చాలామంది చేరారని వివరించారు. కాగా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఐఎస్ఐఎస్ గురించి పోస్టింగులు చేసిన వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థల సహకారాన్ని పోలీసులు కోరనున్నారు.