మూడేళ్లలో రాష్ట్రం నంబర్ 1
♦ అభివృద్ధికి విపక్షాలు కలసి రావాలి: మంత్రి ఈటల
♦ ప్రగతి కోసం అప్పులు చేయడం తప్పు కాదు
♦ మాది ముమ్మాటికీ సంక్షేమ ప్రభుత్వం
♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల ఆసక్తి
♦ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాబోయే మూడేళ్లలో తెలంగాణను తమ ప్రభుత్వం కచ్చితంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగేలా చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినందున ధర్మం ఎజెండాగా ఉండాలని కోరుకోవాలని, ఈ విషయంలో విపక్షాలు సహకరించాలని కోరారు. ఉద్యమ సందర్భంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేసినట్టే రాష్ట్రాభివృద్ధికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం శాసన మండలిలో ఆయన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం మానవీయకోణంలో స్పందించి పనిచేస్తుందని, రాష్ట్రంలో అణగారిన వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి అండగా నిలుస్తుందన్నారు.
గత రెండేళ్లలో బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోవడానికి అనేక కారణాలున్నాయని, 2016-17లో 85-90 శాతం ప్రణాళిక వ్యయం ఖర్చు చే స్తామన్న ధీమా వ్యక్తంచేశారు. తమది ముమ్మాటికీ సంక్షేమ ప్రభుత్వమని, 2011-12లో తెలంగాణలో ఆ రంగానికి రంగానికి రూ.3,221 కోట్లు ఖర్చుచేస్తే... 2015-16లో రూ.11,892 కోట్లు, 2016-17లో రూ.16,169 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ఏడాది, ఏడాదిన్నరలో 2.60 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ మాట లు, చేతలకు తేడా లేకుండా చూస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రం చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చినా ఒదిగే ఉండాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
రాష్ట్రం వైపు.. విదేశాల చూపు
కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు తీసుకోవాల్సి ఉంటుందని ఈటల చెప్పారు. జీఎస్‌డీపీలో అతి తక్కువ రుణాలున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. అప్పు చేసి పప్పు కూడు తినొద్దు కాని అప్పు చేసినా అభివృద్ధి కావాలని, సరిపడ వన రులు లేకపోతే అప్పులు తీసుకోవడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. విపత్కర ఆర్థిక పరిస్థితుల్లో కూడా రాష్ట్రం 2015-16లో 11.7 శాతం వృద్ధి రేటును సాధించిందన్నారు. ప్రభుత్వంగానీ, సంస్థలుగానీ ఆర్థికంగా పటిష్టంగా ఉంటేనే బ్యాంకులు అప్పులిచ్చేందకు ముం దుకు వస్తాయన్నారు.
తెలంగాణ గొప్ప రాష్ర్టం గా అవతరిస్తుందనే విశ్వాసంతోనే బ్యాంకులు అప్పులిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. చెన్నైలో వరదల తాకిడి తర్వాత ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు రావాలని ఆలోచిస్తున్నాయని, నగరం ఎంతో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ కె.స్వామిగౌడ్ ప్రకటించి, సభను గురువారానికి వాయిదావేశారు.