itala Rajinder
-
‘సంక్షేమం’ అమలులో బ్యాంకులు కీలకం
♦ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ♦ ముచ్చర్ల గేట్ వద్ద నూతన ఎస్బీహెచ్ శాఖను ప్రారంభం కందుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగం పెద్దన్న పాత్ర పోషిస్తోందని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ముచ్చర్లగేట్ వద్ద ఏర్పా టు చేసిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్రన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా బ్యాంకులకు తోడ్పాటునందిస్తామని తెలిపారు. బ్యాంకుల సేవలను అన్నదాతలతో పాటు వ్యాపారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముచ్చర్లలో ఏర్పాటు చేసిన 1933వ శాఖ అన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో మొదట రంగారెడ్డిలోనే ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో పెట్టుబడి పెట్టే వారికి బ్యాంకులు తమ సహాయ సహకారా లు అందించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. కార్యక్రమం లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, ఎస్బీహెచ్ ఎండీ శాంతన్ముఖర్జీ, జీఎం సీతాపతిశర్మ, డీజీఎంలు మ్యాత్యూ కుట్టి, ఏసీ సేతీ, ఏజీఎం సూర్యప్రకాష్‌రావు, ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, స్థానిక శాఖ మేనేజర్ దుర్గాప్రసాద్, ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, సర్పంచ్‌లు పీ జయమ్మ, కాస నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు నర్సింహ, టీ ఇందిర, ఈశ్వర్‌గౌడ్, ఉప సర్పంచ్ రామకృష్ణ, స్థానిక నాయకులు కుర్నమోని జయేందర్, దశరథ, జంబుల గణేష్‌రెడ్డి, జంగయ్య, అశోక్, రాంచంద్రారెడ్డి, రమణ, రవి, యాదయ్య, దయాకర్,విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశ్వర్, చంద్రమోహన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, సుభాష్‌చందర్‌రెడ్డి, ఆనంద్, కృష్ణ పాల్గొన్నారు. -
మూడేళ్లలో రాష్ట్రం నంబర్ 1
♦ అభివృద్ధికి విపక్షాలు కలసి రావాలి: మంత్రి ఈటల ♦ ప్రగతి కోసం అప్పులు చేయడం తప్పు కాదు ♦ మాది ముమ్మాటికీ సంక్షేమ ప్రభుత్వం ♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల ఆసక్తి ♦ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలి ఆమోదం సాక్షి, హైదరాబాద్: రాబోయే మూడేళ్లలో తెలంగాణను తమ ప్రభుత్వం కచ్చితంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగేలా చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినందున ధర్మం ఎజెండాగా ఉండాలని కోరుకోవాలని, ఈ విషయంలో విపక్షాలు సహకరించాలని కోరారు. ఉద్యమ సందర్భంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేసినట్టే రాష్ట్రాభివృద్ధికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం శాసన మండలిలో ఆయన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం మానవీయకోణంలో స్పందించి పనిచేస్తుందని, రాష్ట్రంలో అణగారిన వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి అండగా నిలుస్తుందన్నారు. గత రెండేళ్లలో బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోవడానికి అనేక కారణాలున్నాయని, 2016-17లో 85-90 శాతం ప్రణాళిక వ్యయం ఖర్చు చే స్తామన్న ధీమా వ్యక్తంచేశారు. తమది ముమ్మాటికీ సంక్షేమ ప్రభుత్వమని, 2011-12లో తెలంగాణలో ఆ రంగానికి రంగానికి రూ.3,221 కోట్లు ఖర్చుచేస్తే... 2015-16లో రూ.11,892 కోట్లు, 2016-17లో రూ.16,169 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ఏడాది, ఏడాదిన్నరలో 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ మాట లు, చేతలకు తేడా లేకుండా చూస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రం చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చినా ఒదిగే ఉండాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రం వైపు.. విదేశాల చూపు కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు తీసుకోవాల్సి ఉంటుందని ఈటల చెప్పారు. జీఎస్డీపీలో అతి తక్కువ రుణాలున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. అప్పు చేసి పప్పు కూడు తినొద్దు కాని అప్పు చేసినా అభివృద్ధి కావాలని, సరిపడ వన రులు లేకపోతే అప్పులు తీసుకోవడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. విపత్కర ఆర్థిక పరిస్థితుల్లో కూడా రాష్ట్రం 2015-16లో 11.7 శాతం వృద్ధి రేటును సాధించిందన్నారు. ప్రభుత్వంగానీ, సంస్థలుగానీ ఆర్థికంగా పటిష్టంగా ఉంటేనే బ్యాంకులు అప్పులిచ్చేందకు ముం దుకు వస్తాయన్నారు. తెలంగాణ గొప్ప రాష్ర్టం గా అవతరిస్తుందనే విశ్వాసంతోనే బ్యాంకులు అప్పులిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. చెన్నైలో వరదల తాకిడి తర్వాత ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు రావాలని ఆలోచిస్తున్నాయని, నగరం ఎంతో అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ కె.స్వామిగౌడ్ ప్రకటించి, సభను గురువారానికి వాయిదావేశారు. -
రికార్డులు మాయం
రెండు నెలల క్రితమే దృష్టిసారించిన అధికారులు ఆరు నెలల కిందటే రికార్డులు మాయం వివాదాస్పదంగా డాక్టర్ విశ్వశాంతి తీరు పద్నాలుగేళ్లుగా ఒకేచోట పోస్టింగ్ పలుమార్లు బదిలీ ఉత్తర్వులొచ్చినా పలుకుబడితో రద్దు చేయించుకున్న వైనం కలెక్టర్ ఆగ్రహంతో సెలవుపై వెళ్లిన విశ్వశాంతి సమగ్ర విచారణకు మంత్రి ఈటల ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ హెల్త్ : హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి నిధులు పక్కదారి పట్టిన అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. జననీ సురక్షా యోజన (జేఎస్వై), కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక నిధులకు సంబంధించి దాదాపు రూ.70లక్షలకు పైగా సొమ్ము దుర్వినియోగమైందని తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని మూడు రోజుల క్రితం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రెండు నెలల క్రితమే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమీక్షంలో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నిధుల పక్కదారి అంశం చర్చకు వచ్చింది. దీనిపై విచారణ జరుపాలని వరంగల్ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ నాగేశ్వర్రావును ఆదేశించారు. అప్పట్లో విచారణ ప్రారంభించిన నాగేశ్వర్రావు విచారణకు హాజరుకావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వశాంతికి సమాచారం పంపగా, తనకు ఆరోగ్యం బాగాలేదని తెలియచేస్తూ ఆమె పలుమార్లు విచారణకు గైర్హాజరైనట్లు తెలిసింది. దీంతో అనుమానమొచ్చిన విచారణ అధికారులు హుజూరాబాద్ ఆసుపత్రికి వెళ్లి రికార్డులను వెతికారు. అప్పటికే ఆ రికార్డులన్నీ గల్లంతైనట్లు అక్కడి సిబ్బంది చెప్పడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. రికార్డులు మాయం కావడం, డాక్టర్ విశ్వశాంతి గైర్హాజరు కావడంతో విచారణ పూర్తిగా మందగించినట్లు తెలిసింది. అదే సమయంలో ఆస్పత్రి అభివృద్ధిపై దృష్టి సారించిన మంత్రి ఈటల రాజేందర్ మూడు రోజుల క్రితం సమీక్షించగా, నిధుల గల్లంతు, రికార్డుల మాయం వ ంటి అంశాలు చర్చకొచ్చాయి. దీంతో సమగ్ర విచారణకు ఆదేశించడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చే పనిలో పడ్డారు. విశ్వశాంతి తీరు వివాదాస్పదం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్‌గా పనిచేసిన వైద్యురాలు విశ్వశాంతి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా మారిం ది. ఆమె దాదాపు పద్నాలుగు ఏళ్లుగా ఇదే ఆసుపత్రిలో కొనసాగడం విశేషం. మధ్యలో నాలుగుసార్లు బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటికీ తనకున్న రాజకీయ పలుకుబడితో వాటిని రద్దు చేయిం చుకుని మళ్లీ హుజూరాబాద్ ఆసుపత్రిలోనే కొనసాగడం గమనార్హం. అప్పట్లో విశ్వశాంతి బదిలీ అయినప్పటికీ మళ్లీ ఇక్కడే ఎందుకు కొనసాగిస్తున్నారంటూ దళిత సంఘాల నాయకులు ఆందోళనలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బందిపట్ల కఠినంగా వ్యవహరించే విశ్వశాంతి తన పనితీరుపై ఎవరూ మాట్లాడొద్దనే సంకేతాలు పంపుతారనే పేరుంది. కొందరు వైద్యులు తనకు వ్యతిరేకంగా సమాచారం పంపుతున్నారనే అనుమానంతో వారిని ప్రభుత్వానికి సరెండర్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమంది. అప్పట్లో విశ్వశాంతి, ఆసుపత్రి వైద్యులకు మధ్య తీవ్రస్తాయిలో విభేదాలు తలెత్తడం, ఆమె తీరును నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు విధులు బహిష్కరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నిధుల వినియోగంపై సమీక్ష శూన్యం విశ్వశాంతి పద్నాలుగు ఏళ్లపాటు పని చేసిన సమయంలో అనేకసార్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమైనప్పటికీ ఆసుపత్రికి వచ్చిన నిధుల జమ, ఖర్చులపై ఏనాడూ పూర్తిస్థాయిలో సమీక్ష జరగలేదని తెలుస్తోంది. ఆయా నిధుల వినియోగంపై సూపరింటెండెంట్ పారదర్శకంగా వ్యవహరించకపోవడం, సమీక్షలు సైతం నామమాత్రానికే పరిమితమైన నేపథ్యంలో నిధుల వినియోగంపై ప్రముఖుల దృష్టి పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత మూడేళ్లుగా ఆసుపత్రికి సంబంధించిన నిధుల ఖర్చులపై జరిగిన ఆడిటింగ్లోలోనూ దుర్వినియోగమైన అంశాన్ని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిధులు పక్కదారి పడుతున్న విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ రాజకీయంగా ఆమెకున్న పలుకుబడి నేపథ్యంలో చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్ సూచనతో సెలవు... ఈటల రాజేందర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా విశ్వశాంతి, ఆసుపత్రి వైద్యులకు నిత్యం భేదాభిప్రాయాలు రావడం, చివరకు వైద్యులు విధుల బహిష్కరించడంపై మంత్రి అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు వివాదాల్లో కూరుకుపోవడం, మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విసిగిపోయిన కలెక్టర్ నీతూప్రసాద్ సెలవుపై వెళ్లాల్సిందిగా విశ్వశాంతిని ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశంతో ఇక చేసేదేమీలేక విశ్వశాంతి అనారోగ్యం పేరుతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖలో చర్చ జరుగుతోంది.