
సైనికులకు అండగా నిలుద్దాం
• ప్రజలకు చినజీయర్ స్వామి పిలుపు
శంషాబాద్ రూరల్: దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో సైనికులకు అండగా నిలుద్దామని శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పండగల సందర్భంగా సరదాల కోసం డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టవద్దని సూచించారు. ప్రధాని మోదీ సూచన మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశం ఉదారమైనదని, ఎవరు వచ్చి చేయి చాచినా.. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుందన్నారు. ఈ స్వభావాన్ని కొన్ని దేశాలు మన బలహీనతగా భావిస్తే పొరపాటని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశంలో ఉత్తమ పాలన కొనసాగుతోందన్నారు.
వాజ్‌పేయి హయాంలో పాకిస్తాన్ లో బస్సుయాత్ర చేపడితే.. అందుకు ప్రతిఫలంగా కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం ఇరుగు, పొరుగుతో సఖ్యతగా ఉండేందుకు పాక్‌లో పర్యటిస్తే.. 9 మంది జవాన్ల ప్రాణాలు బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.