
విజయవాడకు మకాం మార్చుకో..
ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని వర్గీకరణ అంశంపై డ్రామాలాడుతున్న ఎంఎస్‌పీ నేత మంద కృష్ణమాదిగ విజయవాడకు మకాం మార్చుకోవడం మంచిదని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ధ్వజమెత్తారు. సోమవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ గతంలో తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి సకల జనుల సమ్మెను నిర్వీరం చేసేందుకు కుయుక్తులు పన్నారని ఆరోపించారు.
దండోరా ఉద్యమాన్ని దగాకోరుల పాలు చేసి మాదిగ కులస్తులను మోసగించాడన్నారు. ఉద్యమాన్ని సొమ్ముచేసుకుని మాదిగ జాతికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. టీడీపీని, చంద్రబాబును నమ్ముకొని ఇన్ని రోజులు కాలయాపన చేసిన మంద కృష్ణమాదిగ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టించలేక పోయారని వివరించారు. మాదిగ అమరులను పూర్తిగా విస్మరించి, రాజకీయ లబ్ధికోసం కార్యకర్తలను బానిసలుగా మార్చారని దుయ్యబట్టారు.
తెలంగాణలో నివసించే అర్హత కోల్పోయిన మంద కృష్ణమాదిగ విజయవాడకు మకాం మార్చుకొని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా ప్రకటించుకోవాలని ఎద్దేవా చేశారు. మాదిగ బిడ్డలను టీడీపీ నేతలు చావకొడుతుంటే చోద్యం చూస్తున్నారని, బాబుతో ఒకవైపు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని మరోవైపు దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలంటూ నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యమాలంటే దాడులు కాదని, మాదిగలపై జరుగుతున్న దాడులకు మంద కృష్ణమాదిగ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో నర్సింహమాదిగ, అలెగ్జాండర్, కొల్లూరి వెంకట్, పాల్వాయి నగేష్, కొంగరి శంకర్‌మాదిగ, రమేష్, సైదులు, వెంకట్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.