
నిబంధనలను కఠినంగా అమలు చేయాలి
డ్రైవింగ్ లెసైన్సుల జారీ వ్యవహారంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులకు తావుండరాదని రాష్ట్ర రవాణాశాఖ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది.
- డ్రైవింగ్ లెసైన్సుల జారీపై హైకోర్టు స్పష్టీకరణ
- రోడ్డుపై వాహనాలను ఎలా నడుపుతున్నారో చూడాలి
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : డ్రైవింగ్ లెసైన్సుల జారీ వ్యవహారంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులకు తావుండరాదని రాష్ట్ర రవాణాశాఖ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రైవింగ్ లెసైన్సుల మంజూరు విషయంలో మోటారు వాహన చట్టం నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ రోడ్ క్రాఫ్ట్ సొసైటీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారించింది. లెసైన్సుల జారీ విషయంలో అధికారులు నిబంధనల మేర వ్యవహరించడం లేదని పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ ట్రాక్‌లో వాహనం నడిపితే చాలని, వారికి లెసైన్స్ మంజూరు చేస్తున్నారని తెలిపారు. రోడ్లపై వాహనం ఎలా నడుపుతున్నారన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోడం లేదని, దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ, డ్రైవింగ్ ట్రాక్‌లో నడిపినంత మాత్రాన లెసైన్స్ మంజూరు చేయడం సరికాదని, రోడ్లపై కూడా సక్రమంగా వాహనం నడుపుతున్నారా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.