
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
హైదరాబాద్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్రావు మృతికి సంతాపంగా సోమవారం విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్థన్పై సతీష్ కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయటంతో హర్షవర్థన్ మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా హర్షవర్థన్ అంతిమ యాత్రలో నిన్న వందలాదిమంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి మృతి పట్ల తమకు ఆవేదన, ఆందోళన ఉందని కళాశాల అధ్యాపకులు తెలిపారు.
కాగా హర్షవర్థన్పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే సతీష్ అరెస్ట్ను పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని ఇవాళ లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.