వారానికోసారి గ్రామాలకు వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక వ్యాధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామాలను గుర్తించి వారానికోసారి వైద్య విద్యార్థులు అక్కడికి వెళ్లి రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)పై మోదీ సమీక్ష జరిపారు. అనంతరం ప్రధాని ఆకాంక్షలను తెలియజేస్తూ ఎన్‌హెచ్‌ఎం డెరైక్టర్ సి.కె.మిశ్రా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. ప్రజారోగ్యానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని జిల్లాలు ప్రత్యేక వ్యాధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఇబ్బం దులు పడుతున్నాయని పేర్కొన్నారు.
అలాంటి గ్రామాలకు మెడికల్ కాలేజీలు తమ వైద్య విద్యార్థులను పంపాలన్నారు. అక్కడి అనారోగ్య సమస్యలను అవగాహన చేసుకొని అందుకు పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు అమలు ప్రణాళికలు రూపొందించి కార్యాచరణను ప్రారంభించాలన్నారు. కాగా, కేంద్రం లేఖనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో ప్రజలను పీడిస్తున్న వ్యాధులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.