సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ సమ్మెబాట
- నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటన
-130 ఆస్పత్రులకు సర్కారు రూ.330 కోట్లు బకాయి
- రూ.100 కోట్లు చెల్లించేందుకు అంగీకారం
- ఒప్పుకోని ఆస్పత్రుల యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ ‘సమ్మె’ బాట పట్టాయి. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని అన్ని ప్రైవేట్ అండ్ నర్సింగ్ హోమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునేందుకు వచ్చిన రోగులు సేవలు అందక విలవిల్లాడుతున్నారు.
ఐదు మాసాలు.. రూ.330 కోట్లు : రాష్ట్రంలో 190 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో పేర్లు నమోదు చేసుకున్నాయి. వాటిలో 60 ప్రభుత్వ ఆస్పత్రులు ఉండగా, 120 ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. మరో పది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 30 శాతం సర్వీసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతుంటే 70 శాతం సేవలు ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందిస్తున్నాయి. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగుల బిల్లులను ప్రభుత్వం ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.330 కోట్లకు చేరాయి. వీటిని వెంటనే చెల్లించాలంటూ రెండు నెలల కిందట ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసింది. స్పందించిన ప్రభుత్వం తక్షణమే రూ. 80 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రూ.30 కోట్లే చెల్లించింది. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ జూన్ 30 నుంచి ఆయా ఆస్పత్రుల్లో సర్వీసులు నిలిపేసింది. ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఆందోళన బాట పట్టగాసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మాత్రం సేవలు కొనసాగించాయి.
నేటి నుంచి సేవలు బంద్: టీశా
రోగులకు ఇబ్బంది కలుగుతుండటంతో స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. తక్షణమే రూ.100 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయినా ఆస్పత్రులు పట్టు వీడలేదు. ఆదివారం సమావేశమై భవిష్యత్తు కార్యచరణ రూపొందించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల బాటలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ నడుస్తాయని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీశా) ప్రకటించింది. సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు టీశా అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్‌రావు స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో కుదుర్చుకున్న ఎంవోయూను సమీక్షించి పెరిగిన చార్జీలకు అనుగుణంగా టారిఫ్‌ను పెంచాలని ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ కన్వీనర్ సురేశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మూడు రోజుల నుంచి పడిగాపులు
కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో ఆరోగ్యశ్రీ కింద సర్జరీ కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చా. తొలి రోజు ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్నామని చెప్పారు. మరుసటి రోజు కూడా వచ్చా. చేర్చుకోవడం కుదరదని చెప్పారు. సొంతూరుకు వెళ్లలేక మూడు రోజుల నుంచి ఆస్పత్రి సెల్లార్‌లోనే తలదాచుకుంటున్నా. - నర్సింహ, కల్వకుంట్ల, నల్లగొండ జిల్లా