సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం నుంచి బకాయిలు అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్ల మేర బకాయిలు అందాల్సి వుందని, బకాయిల చెల్లింపులకు ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం గడువు విధించినా ప్రభుత్వం స్పందించలేదని ప్రైవేట్ ఆస్పత్రులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల సమ్మెపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 15 వందల కోట్ల బకాయిలు చెల్లించాలన్నది వాస్తవం కాదని, కేవలం రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. అవి కూడా ఒకేసారి చెల్లించే అవకాశం ఉండదన్నారు. దశల వారీగా బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
వరుస ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం వారికి బడ్జెట్ కేటాయించలేక పోయిందన్నారు. ఈ సమ్మెను తాము తాత్కాలిక సమ్మెగానే పరిగణిస్తామని చెప్పారు. చాలా వరకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. బకాయిల పేరిట ఆస్పత్రులు అత్యవసర సేవలు నిలిపివేయడం సరైనది కాదన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రులు తమకు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment