‘స్వచ్ఛ'...ఇక నిత్యం!
నెలలో ఒక రోజు అధికారులు వస్తారు
{పజల సమస్యలు తెలుసుకుంటారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
మండుటెండలో పర్యటన
ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో రెండు లక్షల మంది నిరుపేదలకు డ బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. లక్ష మందికి ఇళ్ల పట్టాల మంజూరు..చెత్తపై యుద్ధం... పరిశుభ్రతపై మహోద్యమం.... మార్కెట్లు.. బస్తీలు.. మురికివాడల అభివృద్ధికి హామీలు.. ఇవీ చివరి రోజైన బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ విశేషాలు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ నగరంలో ఏకంగా పదికి పైగా ప్రాంతాలను సందర్శించారు. ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
పేదలకు గృహాలను నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ నాలుగు రోజులతోనే అయిపోదని.. నెలలో ఒక రోజు అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి... వాటిని పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై మేథోమథనం చేసి... సమస్య మూలాలకు వెళ్లి... పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాత నగరం సహా శివార్లలోని ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు.