హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు పేద, మధ్య తరగతి వర్గాలు భరించలేవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. శనివారం విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా నాంపల్లి చౌరస్తాలో టీ.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్బాబు, అంజన్కుమార్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దిగిరాకుంటే ఇతర పార్టీలతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఛార్జీలు పెంచడమా అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... శ్రీధర్బాబు, అంజన్కుమార్ యాదవ్, గండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గోషామహాల్ పీఎస్కు తరలించారు.