
'26 నెలల్లో 16 జీవోలను హైకోర్టు రద్దు చేసింది'
హైదరాబాద్ : జీవో 123 రద్దు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో 16 జీవోలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు అభిశంసించినట్లే అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 123 జీవోపై ప్రభుత్వానికి ఎందుకంత పట్టుదల అని ఆయన ప్రశ్నించారు.
చట్టపరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం కాదని టీఆర్ఎస్ సర్కార్ ముందుకు వెళితే ఉద్యమం తప్పదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. 'మీ గురువు చంద్రబాబు బాటలో పయనిస్తే మీ పతనం కూడా ఖాయమని' కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.