గుంత చూపండి వెయ్యి తీసుకోండి
ప్రత్యేక యంత్రాల ద్వారా పనులు మూడు నెలల్లో పూర్తి
గ్రేటర్ రోడ్డుపై గుంత కనిపిస్తే మీ పంట పండినట్టే... ఎందుకనుకుంటున్నారా.. గుంత ఉన్నట్టు చూపితే వెయ్యి రూపాయలు నజరానా కూడా మీ సొంతమవుతుంది. ఇది నిజమేనండి.. కాకపోతే దీనికి మూడు నెలలు ఆగాల్సిందే. ఈ ప్రయోగాన్ని అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.
రోడ్లపై ఒక్క గుంతా లేకుండా చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు తమకు కనీసం మూడు మాసాల సమయం కావాలంటున్నారు. ఆ తర్వాత రహదారులపై పాట్‌హోల్స్ గుర్తించిన వారికి నజరానా ఇస్తామంటున్నారు. ఎక్కడ గుంతకనపడినా వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను సమకూర్చునే పనిలో పడ్డారు. వాటిల్లో ఉండే కాంక్రీట్ మిక్స్‌తో గుం తలను ఎప్పటికప్పుడు పూడ్చివేస్తారు. వీటితో వర్షాకాలంలో సైతం పనులు చేయవచ్చు. ఢిల్లీలో ఈ విధానం అమలులో ఉంది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో నగరంలో ఈ విధానాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో అద్దె ప్రాతిపదికన యం త్రాలను వినియోగంలోకి తేనున్నారు. పూడ్చివేసే గుంతల పరిమాణాన్ని బట్టి కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తారు. ఒక యంత్రం ద్వారా రోజుకు దాదాపు 50 పాట్‌హోల్స్‌ను పూడ్చివేయవచ్చు. పూడ్చివేసిన గుంత ఏడాదిలోగా దెబ్బతిన్నా కాంట్రాక్టు సంస్థే తిరిగి పనిచేయాల్సి ఉంటుంది. తొలుత ప్రధాన రహదారుల్లోని పాట్‌హోల్స్‌కు మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు.
అనంతరం కనబడ్డ పాట్‌హోల్స్ అన్నింటికీ మరమ్మతులు చేయడమే కాక, ఎక్కడ పాట్‌హోల్ కనబడ్డా తెలియజేయాల్సిందిగా ప్రజల నుంచి ఫిర్యాదులు ఆహ్వానిస్తారు. కెమెరా లేదా సెల్‌ఫోన్ ద్వారా సదరు ఫొటోను జీహెచ్‌ఎంసీకి పంపిస్తే జీపీఎస్ ద్వారా వాటిని గుర్తిస్తామన్నారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇలా.. మూడు నెలలపాటు ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులతో సహ అన్ని పాట్‌హోల్స్ పూడ్చివేస్తారు. ఆ తర్వాత ఎక్కడ పాట్‌హోల్ ఉందో చెప్పేవారికి వెయ్యిరూపాయలు బహుమానంగా ప్రకటిస్తామని కమిషనర్ చెప్పారు.
రూ. 50 కోట్లు వ్యయం..
జీహెచ్‌ఎంసీలో ఆరువేల కి.మీ.లకు పైగా రహదారులుం డగా.. ఏటా పాట్‌హోల్స్ పూడిక పేరిట దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు.