చర్చలు విఫలం
ఫలితం లేని చర్చలను బహిష్కరిస్తున్నామన్న క్యాబ్ డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై శనివారం రెండో రోజు రవాణా శాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలు తమ సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి న్యాయం చేయలేకపోయాయని వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. సమస్యలకు కారణమైన ఉబెర్, ఓలా సంస్థలకు చెందిన ప్రతినిధులే చర్చలకు హాజరు కాలేదని, ఎలాంటి ఫలితమివ్వని చర్చలను తాము బహిష్కరిస్తున్నామని సీఐటీయూ ప్రతినిధి ఈశ్వర్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సురేష్, సర్వేష్, లక్ష్మణ్ తదితరులు చెప్పారు.
రెండు రోజులుగా అధికారులతో చర్చల్లో పాల్గొన్నప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిరసన తెలియజేస్తూ డ్రైవర్లంతా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలోని నిరుపేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగులు అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసుకున్నారని, ఉపాధి కోసం ఓలా, ఉబెర్ సంస్థల్లో చేరితే ఆ సంస్థలు తమను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయని, ప్రోత్సాహకాల్లో కోత విధించి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని వివిధ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వం కూడా వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీఏ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకుని భారీ సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
సమ్మె యదాతథం..
రవాణా శాఖతో చర్చలు విఫలమైన నేపథ్యంలో తమ సమ్మెను ఉధృతం చేయనున్నట్లు ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు తెలిపారు. పూర్తిస్థాయిలో వాహనాలను నిలిపివేస్తామన్నారు. గత నెల 30 అర్ధరాత్రి నుంచి ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన సుమారు 80 వేల వాహనాలు సమ్మెకు దిగడంతో నగరంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దీక్ష భగ్నం.. గాంధీకి తరలింపు..
మరోవైపు మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ ఆరోగ్యం విషమించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి.. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకు బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని, క్యాబ్‌ల బంద్‌ను మరింత ఉధృతం చేస్తామని శివ ప్రకటించారు.