తనిష్క్ జువెల్లరీ భారీ చోరీ కేసులో
పూర్తయిన విచారణ
మరో ఇద్దరు నిందితుల అరెస్టు
పదిరోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
పంజగుట్ట, న్యూస్‌లైన్:
నగరంలో సంచలనం సృష్టించిన పంజగుట్ట తనిష్క్ జువెల్లరీలో భారీచోరీ కేసును పోలీసులు పూర్తిగా ఛేదించారు. వందశాతం బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతనెల 25న జరిగిన ఈ చోరీ కేసులో ప్రధాన నిందితులు భూమన కిరణ్‌కుమార్(24), గంటినపాటి ఆనంద్(24)లు మీడియా ముందు లొంగిపోగా కోర్టులో హాజరుపర్చిన పోలీసులు ఇటీవలే కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించారు. నిందితుడు కిరణ్ బేగంపేట ఫ్యామిలీవరల్డ్‌లో పనిచేసే సమయంలో పరిచయమైన స్నేహితుడు ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (35)కి దొంగతనం చేసిన రోజే రెండు బంగారు గాజులను అమ్మి పెట్టాలని ఇచ్చాడు. దీంతో ఆయన గాజులను ఎల్లమ్మబండలో ఉన్న శ్రీకృష్ణా జ్యువెలరీ అండ్ పాన్ బ్రోకర్ యజమాని మోహన్‌లాల్ (42)కు రూ.45వేలకు విక్రయించాడు.
చంద్రశేఖర్ తాను రూ.15వేలు ఉంచుకొని కిరణ్‌కు రూ.30వేలు ఇచ్చాడు. కిరణ్ రూ.30వేలలో ఆనంద్‌కు రూ.20వేలు ఇచ్చాడు. కాగా కిరణ్ లొంగిపోయిన రోజున పోలీసులు అతడ్నించి రూ.8,600లు రికవరీ చేశారు. మంగళవారం దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు సహకరించిన చంద్రశేఖర్‌గౌడ్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు ఆయన్నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేసిన కృష్ణా జ్యువెలరీ యజమాని మోహన్‌లాల్‌ను కూడా అరెస్టు చేసి ఆయన్నించి రెండు బంగారుగాజులను స్వాధీనం చేసుకున్నారు. కిరణ్,ఆనంద్‌లతోపాటు చంద్రశేఖర్‌గౌడ్, మోహన్‌లాల్‌లను పంజగుట్ట పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా తనిష్క్ కేసులో చోరీకి గురైన 15.57 కిలోల బంగారం పూర్తిగా 100 శాతం రికవరీ సాధించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దొంగతనం చేసిన సమయంలో నిందితులు వాడిన మంకీ క్యాప్, గ్లౌజులు, సుత్తి, స్క్రూడ్రైవర్, కాళ్లకు కవర్లు, అద్దాలను పంజగుట్ట బస్టాపు వెనుకభాగంలో వాటిని పడేయగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దొంగ సొత్తును ఎవరైనా కొనుగోలు చేసినా, కొనుగోలు చేసేందుకు సహకరించినా శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.
100 శాతం రికవరీ
Published Wed, Feb 5 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement