టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న తీగల, తలసాని, ఎమ్మెల్సీ గంగాధర్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్)తోపాటు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీకేఆర్ కళాశాల ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్‌లో ఏర్పాటు చేసే సభ ద్వారా పార్టీ మారనున్నారు.
ఈ మేరకు నలుగురు నేతలు మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి చర్చలు జరిపారు. నిజాం కాలేజ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి పార్టీలో చేరుతానని తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పినప్పటికీ, సీఎం సూచన మేరకు బుధవారమే గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. కాగా, గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న తలసాని, తీగల సహచర టీడీపీ నాయకులు కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీ మారుతున్నట్టు సమాచారం.