చంద్రబాబుతో కర్నూలు టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో కర్నూలు జిల్లా నుంచి విపక్ష నేతలు చేరటాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్న అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. తాము పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చేరామని, అలాంటి తమకు ఇతరుల చేరికవల్ల ప్రాధాన్యత తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి నంద్యాల శాసనసభ్యుడు, పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిలను విజయవాడ పిలిపించుకుని వారితో సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తమలో కొందరు ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నారని, మరికొందరం గత ఎన్నికలకు ముందు పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చేరామని, భూమాలాంటి వారి చేరికవల్ల తమకు ప్రాధాన్యత తగ్గుతుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
భావసారూప్యత కలిగిన వారిని చేర్చుకుంటాం: భావసారూప్యత కలిగిన వారిని చేర్చుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం చేరికపై ప్రశ్నించగా... చూస్తారుగా, చూస్తారుగా అని వ్యాఖ్యానించారు.
భూమాను చేర్చుకోవద్దు
Published Sun, Feb 21 2016 2:38 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement