
టీడీపీలో టికెట్ల చిచ్చు
తెలుగుదేశం పార్టీలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల టికెట్ల చిచ్చు భగ్గుమంది.
అధిష్టానం నిర్ణయంపై శ్రేణుల భగ్గు
చిలుకానగర్‌లో టీడీపీ దిష్టిబొమ్మకు శవయాత్ర
చౌరస్తాలో దహనం మూకుమ్మడి గా రాజీనామా
ఉప్పల్: తెలుగుదేశం పార్టీలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల టికెట్ల చిచ్చు భగ్గుమంది. ఆశావహులకు హామీ ఇచ్చి టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపిన పార్టీ అధిష్టానం తీరుపై శ్రేణులు భగ్గుమంటున్నారు. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి... తమ నిరసన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివరాలివీ... చిలుకానగర్ డివిజన్ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన ఆ పార్టీ నాయకులు టికెట్ రాక పోవడంతో పాటు ఒక్క సారిగా రగిలిపోయారు. నిన్నటి వరకు బి ఫాం అందిస్తామని హామీ ఇచ్చిన నాయకులు చివరకు మొండి చేయి చూపించడంతో నేత బొమ్మగాని దాస్‌గౌడ్ అనుచరగణం ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా చిలుకానగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు దాస్‌గౌడ్, చైతన్యగౌడ్ తదితరులు మాట్లాడుతూ... సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్‌టీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరామన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించి 33 సంవత్సరాల కాలంలో ఎలాంటి పదవులను ఆశించకుండా పనిచేస్తూ వచ్చామన్నారు.
ప్రస్తుతం టికెట్ కోసం డబ్బులను ఆశిస్తున్న టీడీపీ హోల్ సెల్ దుకాణంగా మారిందని ఆరోపించారు. బ్రోకర్స్‌తో టికెట్ల దందా నడిపిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీ అధిష్టానం తీరు బాధాకరమని, తెలంగాణలో పార్టీ భూస్థాపితం కావడం తథ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ దుకాణాన్ని మూసుకోకపోతే తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ అధిష్టానం అవలంభిస్తున్న కార్యకర్తలు, నేతల వ్యతిరేక విధానాలకు నిరసనగా చిలుకానగర్‌లో నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం టీడీపీ దిష్టి బొమ్మను చిలుకానగర్ చౌరస్తా వరకు శవయాత్ర చేసి చౌరస్తాలో దహనం చేశారు. దారి పొడవునా టీడీపీ, దేవేందర్‌గౌడ్, వీరేందర్ గౌడ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నేతలు ఈరెల్లి రవీందర్, ఇమామ్, గోనె శ్రీశైలం, మక్కాల రామకృష్ణ పాల్గొన్నారు.