సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ఎవరికివారే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొత్తగా పా ర్టీలో చేరినవారికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటం పాతనేతలకు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. నాటి నుంచి ఇక్కడి టీడీపీ నాయకులు జనానికి ముఖం చాటేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారన్నది అగమ్యగోచరమే.
విజయనగరంలో మూడు ముక్కలాట...
విజయనగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. దశాబ్దాలుగా పా ర్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్‌కు ఇంటా, బయటా వర్గపోరు తప్పట్లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు తాజాగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారులుగా చేరారు. ఈ ఇద్దరి పోకడ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి సుతరామూ ఇష్టం లేదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఎటువంటి సామాజిక బలం, ఓటుబ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేద్దామన్న ఆలోచనతో వాజీ సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మరోవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నవారి జాబితాలో మీసాల గీత తర్వాత వాజీ శ్రీనివాసరావు చేరారు. ఆ ఇద్దరి నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికీ వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీచేశారు.
బేబినాయనకు కేడర్ సమస్య
బొబ్బిలిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన)కే టికెట్ లభిస్తుందనేది అందరి మాట. ఆయన సోదరుడు సుజయ్‌కృష్ణ రంగారావు సీన్‌లోకి వస్తే సీటు తన్నుకుపోతాడనే భయం బేబీనాయన అనుచరుల్లో ఉంది.
కానీ మండలాల్లో కేడర్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అన్నిచోట్లా గ్రూపు తగాదాలున్నాయి. రామభద్రపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటా్నయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
కళా, ప్రతిభల మధ్య నలుగుతున్న కోండ్రు
రాజాం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న కోండ్రు మురళీమోహన్‌కు అక్కడి సీనియర్ నేతలైన కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి వర్గాలతో తెగని పేచీ ఉంది. ఇప్పటికే రేగిడి మండలంలో కళా వెంకటరావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు కోండ్రుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజాం మండలం పొగిరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ జడ్డు విష్ణుమూర్తి కోండ్రు ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికీ రావట్లేదు. మరోవైపు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఈసారి తనకు ఎలాగైనా రాజాంలో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశలో పావులు కదుపుతున్నారు.
కోళ్లకు కృష్ణ సెగ
శృంగవరపుకోటను మొదటి నుంచీ ఏలుతున్న కోళ్ల కుటుంబానికి గొంప కృష్ణ రూపంలో సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తానే సీనియర్‌ననీ... లోకేశ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పుకుంటుండగా చంద్రబాబు అండతో ప్రవాస భారతీయుడు గొంప కృష్ణ వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు లలితకుమారి ప్రతి గ్రామానికి వెళ్లి బంధువుల ఇళ్లల్లో ఆంతరంగిక సమావేశాలు పెడుతున్నారు.
నెల్లిమర్లలో అంతా అయోమయం
నెల్లిమర్ల టీడీపీ టికెట్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జి భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగార్రాజుకు ఖరారైనట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా మరో ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో డెంకాడ మండలానికి చెందిన కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ మండలానికి చెందిన పతివాడ తమ్మునాయుడు, నెల్లిమర్ల మండలానికి చెందిన కడగల ఆనంద్‌కుమార్ ఉన్నారు. బంగార్రాజు స్పీడుకు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వర్గీయులు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్‌చార్జి లోకం మాధవికే అవకాశం ఉంటుందన్న ప్రచారమూ లేకపోలేదు.
నిమ్మకకు పెరిగిన అసమ్మతి
పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణకు సొంత పా ర్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. ఆయనకు పోటీగా పడాల భూదేవి, వంగర మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు తేజోవతి కళా వెంకటరావు ప్రోత్సాహంతో టికెట్ కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన టీడీపీ నాయకులైన సామంతుల దామోదరరావు, ఖండాపు వెంకటరమణ తదితరులు నిమ్మక తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు భూదేవికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. వీరికి అచ్చెన్నాయుడు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారాలవల్ల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.
నాయుడు పక్కలో బల్లెంలా ‘కరణం’
గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీకి అంతా తానే అని భావిస్తున్న కేఏ నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పక్కలో బల్లెంలా మారారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆమె కూడా పొత్తులో భాగంగా తనకే టికెట్ కేటాయించాలని యత్నిస్తున్నట్టు తెలిసింది.
గంటా పేరుతో గందరగోళం
చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నా చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. గంటా ఇక్కడ పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పనిసరైతే స్థానిక కేడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అంతో ఇంతో కేడర్ బలమున్న కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజుకు ప్రతిసారీ పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ఆయన స్తబ్దుగానే ఉన్నారు.
కురుపాంలో కుమ్ములాట...
కురుపాంలో టీడీపీ టికెట్ కోసం ఎనిమిది మంది కుమ్ములాడుకుంటున్నారు. తోయక జగదేశ్వరికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇప్పించడంలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కీలక పాత్ర పోషించారు. ఇది నచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు మరో ఏడుగురు ఆశావాహులను తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రదీప్‌కుమార్ దేవ్ తనయుడు వీరేశ్‌దేవ్ కూడా టికెట్‌కోసం అశోక్ గజపతి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
పార్వతీపురంలో తెరపైకి ఎన్నారై
దశాబ్దాలుగా పా ర్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఇక్కడ డబ్బు పెట్టగలిగిన ప్రవాస భారతీయుడు బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్న బాబు హామీతో చిరంజీవులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అంత ఉత్సాహం అయితే ఆయనలో కనిపించడం లేదు. మరో సీనియర్ నాయకుడు గర్భాపు ఉదయభానుకు చంద్రబాబు గత రెండు ఎన్నికలుగా మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.
సాలూరులో ఆగని వర్గపోరు...
సాలూరులో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్.కె.భంజ్‌దేవ్ మధ్య వైరం కొనసాగుతోంది. ఇరువురూ బయటకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా... ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చలేని అధిష్టానం ఇక్కడ కూడా ఓ ఎన్‌ఆర్‌ఐని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment