సభాసమరం!
► నేటి నుంచే అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు
► ఉదయం 10 గంటలకు ప్రారంభం..
► ప్రభుత్వంపై ముప్పేట దాడికి సిద్ధమైన ప్రతిపక్షాలు
► ‘డబుల్’ ఇళ్లు, రుణమాఫీ, రైతు సమస్యలు,
ప్రాజెక్టులు, భూసేకరణపై నిలదీసేందుకు సిద్ధం
► దీటుగా జవాబిస్తామంటున్న అధికార పక్షం..
► ఎదురుదాడితో తిప్పికొట్టేందుకు వ్యూహాలు
► అభివృద్ధి, సంక్షేమాన్ని గట్టిగా చెప్పుకోవాలని నిర్ణయం..
సుమారు 20 అంశాలపై చర్చ!
► తొలిరోజు అసెంబ్లీలో నోట్ల రద్దుపై, మండలిలో విద్యుత్ పరిస్థితిపై చర్చ
హైదరాబాద్: రాష్ట్రంలో సభా సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టించనున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలంలో ఏం చేశారంటూ అధికార పక్షంపై ముప్పేట దాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమైపోతే.. ఎదురుదాడితో దీటుగా సమాధానం ఇచ్చేందుకు పాలక పక్షం సన్నద్ధమైపోయింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గురువారం జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయించారు. సెలవు రోజులు పోగా 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా 20 దాకా అంశాలు చర్చకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
తొలిరోజున అసెంబ్లీలో ‘నోట్ల రద్దు’ అంశంపై, మండలిలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై చర్చలు జరుగనున్నాయి. అయితే ఈ రెండున్నరేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి చర్చించి, రెండున్నరేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఎదుట పెట్టాలని అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అటు అధికార పక్షంతో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, టీడీపీలు కూడా తీవ్రంగా కసరత్తు చేశాయి.
హామీలపై నిలదీతకు విపక్షాలు సన్నద్ధం
ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో దేనిని కూడా పూర్తి చేయలేదన్న వాదనను విపక్షాలు లేవనెత్తనున్నాయి. ప్రధానంగా వ్యవసాయరంగ సమస్యలను ప్రస్తావించి చర్చకు పెట్టనున్నారు. రుణమాఫీ, పంట రుణాలు పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇన్‌పుట్ సబ్సిడీ అందకపోవడం, కరువు వంటివి చర్చకు రానున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు వ్యూహం రచిస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లోనూ అక్రమాల అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో ప్రజలను పెట్టిన ఇబ్బందులను ఏకరువు పెట్టనున్నారు. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర పరిధిలోని అంశాలకు సవరణలు చేసి ఈ సమావేశాల్లోనే భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో... ఈ అంశం సభను వేడెక్కించే అవకాశముంది. ఇక నోట్ల రద్దు తర్వాత కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపించాయి. కాంగ్రెస్ ఈ అంశంపై సమావేశాల తొలిరోజే దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
‘డబుల్’ ట్రబుల్
టీఆర్‌ఎస్ ఎన్నికల హామీల్లో ప్రధానమైన రెండు పడక గదుల ఇళ్ల పథకంపై విపక్షాలు గొంతెత్తనున్నాయి. సీఎం అధికారిక నివాసం కోసం ఏకంగా రూ.40 కోట్లకుపైగా ఖర్చుపెట్టారని మండిపడుతున్న ప్రతిపక్షాలు.. ‘డబుల్’ ఇళ్ల ప్రగతిపై చర్చకు పట్టుబట్టనున్నాయి. అదే మాదిరిగా లక్షలాది మంది విద్యార్థుల చదువుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు సైతం ఆందోళనకు దిగుతున్నాయి. సభలో ఈ అంశం దుమారం రేపే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఇంటికో ఉద్యోగం హామీ, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపైనా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
విశ్వనగరం చేసేదెప్పుడు!?
గ్రేటర్ ఎన్నికల ముందు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని ఊదరగొట్టిన అధికార పక్షం.. తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు ఆలస్యంపై, నగర రోడ్ల దుస్థితిపై నిలదీయనున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల అంశాన్నీ లేవనెత్తనున్నాయి.
ఎదురు దాడే వ్యూహం!
ప్రతిపక్షాలు సంధించే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమైపోయిన అధికార టీఆర్‌ఎస్... మరోవైపు ఎదురు దాడి వ్యూహానికీ పదును పెడుతోంది. టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనా హయాంలో జరిగిన అభివృద్ధి ఎంత, అవినీతి అంశాలను ఎత్తి చూపనుంది. మరోవైపు కేవలం రెండున్నరేళ్లలోనే తాము సాధించిన విజయాలను వివరించడం ద్వారా ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది. విపక్షాలు ఏ అంశాలను లేవనెత్తే అవకాశం ఉందో ముందే ఓ అంచనాకు వచ్చిన టీఆర్‌ఎస్... ఆ మేరకు తమ మంత్రులు, ఇతర ముఖ్య సభ్యులను సిద్ధం చేసింది. మొత్తంగా అధికార, విపక్షాలు శీతాకాల సమావేశాలను వేడెక్కించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.