హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఎగరవేసే గాలిపటాల కోసం ఉపయోగించే చైనా మాంజాను, గ్లాజు పూత మాంజాను నిషేధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. చైనా మాంజా (నైలాన్ దారం), గాజుపూత మాంజాను అమ్మడం, కలిగి ఉండటం, గాలిపటాలు ఎగరవేసేందుకు వినియోగించడం నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాధారణంగా సంక్రాంతి పడుంగ అనగానే ఆకాశం రంగురంగుల పతంగులతో సరికొత్త హరివిల్లులా దర్శనమిస్తుంది. గాలిపటాల హోరాహోరీ పోట్లాటతో రణరంగాన్ని తలపిస్తుంది. అయితే తమ గాలిపటం తెగిపోకుండా ఎదుటివారి పతంగులకు పేంచి వేసేందుకు ఈ మధ్య చాలామంది చైనా మాంజాను వాడుతున్నారు. దీనివల్ల పావురాలు, పిట్టలు, గద్దలు.. ఇలా పక్షులన్నీ గాయాలపాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. ఈ మాంజా వల్ల మనుష్యులు కూడా గాయాలపాలవుతున్నారు. ఈ నైలాన్ దారం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరుగడమే కాకుండా ఇది భూమిలో, నీటిలో తొందరంగా కలిసిపోకపోవడం వల్ల పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పక్షులపై ప్రేమ, సానుభూతి గల ప్రజలు సైతం గాలిపటాలు ఎగరేసేందుకు చైనీస్ మాంజాను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదని, మాములు దారంతోనే గాలిపటాలను ఎగరవేసి మన ఆనందాన్ని పక్షులకు కూడా పంచాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
పక్షులకు ప్రేమతో.. చైనీస్ మాంజాకు చెక్!
Published Thu, Jan 14 2016 4:05 AM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM
Advertisement