రోహిత్ చనిపోవడం బాధాకరం: కేసీఆర్
హైదరాబాద్: ఇటీవల తీవ్రస్థాయి ఆందోళనలకు, నిరసనలకు కారణమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. వేముల రోహిత్ ఆత్మహత్య గురించి ప్రస్తావిస్తూ హెచ్‌సీయూలో ఒక విద్యార్థి చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై వాయిదా తీర్మానం కింద అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో కేసీఆర్ ప్రతిస్పందించారు. హెచ్‌సీయూలో, ఓయూలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, అవి జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ ఘటనలను అందరూ ఖండించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కారుపై దాడి జరగడం విచారకరమన్నారు.
ఈరోజు (శనివారం) డిమాండ్ల పద్దు, హోం శాఖపై చర్చ జరగనుందని, కాబట్టి హోంశాఖపై చర్చలో భాగంగా హెచ్‌సీయూ, ఓయూ ఘటనలను కూడా చర్చిద్దామని ఆయన కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. గంట సమయం ఎక్కువ తీసుకొని అయినా అన్ని అంశాలను సాకల్యంగా చర్చిద్దామని, ఇందుకు సభ్యులు సహకరించాలని సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను కోరారు. హెచ్‌సీయూ అంశంపై చర్చకు పట్టుబడుతూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుండటంతో వారిని విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.