vemula rohith suicide
-
రోహిత్ చనిపోవడం బాధాకరం: కేసీఆర్
హైదరాబాద్: ఇటీవల తీవ్రస్థాయి ఆందోళనలకు, నిరసనలకు కారణమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. వేముల రోహిత్ ఆత్మహత్య గురించి ప్రస్తావిస్తూ హెచ్‌సీయూలో ఒక విద్యార్థి చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై వాయిదా తీర్మానం కింద అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో కేసీఆర్ ప్రతిస్పందించారు. హెచ్‌సీయూలో, ఓయూలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, అవి జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ ఘటనలను అందరూ ఖండించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కారుపై దాడి జరగడం విచారకరమన్నారు. ఈరోజు (శనివారం) డిమాండ్ల పద్దు, హోం శాఖపై చర్చ జరగనుందని, కాబట్టి హోంశాఖపై చర్చలో భాగంగా హెచ్‌సీయూ, ఓయూ ఘటనలను కూడా చర్చిద్దామని ఆయన కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. గంట సమయం ఎక్కువ తీసుకొని అయినా అన్ని అంశాలను సాకల్యంగా చర్చిద్దామని, ఇందుకు సభ్యులు సహకరించాలని సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను కోరారు. హెచ్‌సీయూ అంశంపై చర్చకు పట్టుబడుతూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుండటంతో వారిని విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులకు మద్ధతు తెలిపేందుకు హైదరాబాద్ కు ఆయన వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హెచ్‌సీయూకి ఆయన వెళ్లనున్నారు. హెచ్‌సీయూకి చేరుకున్న అనంతరం వర్సిటీ విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు. నేటి రాత్రి హెచ్‌సీయూ విద్యార్థులతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం వరకు విద్యార్థులు చేపట్టనున్న ఆందోళనల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. -
వచ్చే నెల1 నుంచి ధర్నాలు, బంద్‌లు
విజయవాడ(గాంధీనగర్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమబాట పట్టనుంది. ఫిబ్రవరి ఒకటిన అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తారొకోలు, 2న ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, 3న విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజీవ్త్రన్, ఎ.రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, దత్తాత్రేయలను క్యాబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నా కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మాత్రమే చేసి రోహిత్ విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెచ్చరిల్లుతోందని, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల దాడులు పెరిగాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దాడులను అరికట్టి అన్నివర్గాల విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. రోహిత్ తమ్ముడికి పర్మినెంట్ ఉద్యోగంతోపాటు ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐ.బయ్యన్న (ఏఐఎస్ఎఫ్), డి. నారాయణరెడ్డి (వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్), కరీముద్దీన్ (స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్) పాల్గొన్నారు. -
రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ
-
రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ
హైదరాబాద్: హెచ్‌సీయూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అనంతరం అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. వర్సిటీలో వాతావరణం ఇలా ఉన్న నేపథ్యంలో వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ అప్పారావు లీవ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయన లీవ్ పై వెళుతూ ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించారు. దీనిపై వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదని, తనపై ఆరోపణలు వస్తున్నాయని భావించిన వీసీ తాత్కాలికంగా ఈ ఘటన నుంచి తప్పుకునేందుకు లీవ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ వీసీగా విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయి. వర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోసారి మంటపెట్టారు: విద్యార్థులు తమ ఉద్యమానికి వీలువ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అసలే మా కడుపు మండిపోతుంటే.. మళ్లీ మరోసారి మంట పెట్టిన చర్యగా శ్రీవాత్సవ్ నియామకంపై విద్యార్థులు అభివర్ణించారు. ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉండగా కేవలం శ్రీవాత్సవ్ నే ఇన్ఛార్జ్ వీసీగా నియమించారని ఓ విద్యార్థి ప్రశ్నించారు. చెన్నై నుంచి కొందరు విద్యార్థులు వచ్చారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి రేపు మరికొంతమంది విద్యార్థులు వస్తారని దీక్ష తీవ్రరూపం దాల్చుతుందని చెప్పారు. విపిన్ శ్రీవాత్సవ్, వీసీ అప్పారావు ఇద్దరికి రోహిత్ ఆత్మహత్యకు సంబంధం ఉందని విద్యార్థులు ఆరోపిస్తూ తమ ఆందోళనను తీవ్రం చేస్తున్నారు. -
'ఉద్యమం ఆగదు.. 25న ఛలో హెచ్‌సీయూ'
హైదరాబాద్: దళిత పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన తమ ఉద్యమం ఆగబోదని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. మరో ఏడుగురు విద్యార్థులతో మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. హెచ్‌సీయూ ప్రాంగణంలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో విద్యార్థి జేఏసీ నేతలు శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ, తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని హెచ్‌సీయూ జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 25న 'ఛలో హెచ్‌సీయూ' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని అన్ని వర్సిటీల నుంచి విద్యార్థుల తరలిరావాలని కోరారు. -
'విద్యార్థి సంఘాల రాజకీయాలు కామన్'
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల రాజకీయాలు సర్వసాధారణమని, వాటిని పరిష్కరించడంలో వర్సిటీ యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ విషయంలో వర్సిటీ యాజమాన్యం పక్షపాతంలేకుండా సమన్యాయం పాటించాల్సిన అవసరముందన్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులపై సస్పెన్షన్ వ్యవహారాన్ని యూనివర్సిటీలోనే పరిష్కరించి ఉంటే బాగుండదని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ ప్రతిభ గల విద్యార్థి అని, ప్రతిభావంతుడైన పౌరుణ్ణి ఈ సమాజం కోల్పోయిందని మాణిక్ సర్కార్ అన్నారు. -
దీక్ష చేస్తున్న విద్యార్థుల పరిస్థితి విషమం!
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లేవల్స్ పడిపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో శుక్రవారం రాత్రి ఏ క్షణంలోనైనా విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: దళిత రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దిగివచ్చింది. నలుగురు దళిత పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురువారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌తోపాటు ఈ నలుగురు విద్యార్థులపై గతంలో హెచ్‌సీయూ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఏబీవీపీ విద్యార్థిపై దాడి చేశారనే ఆరోపణలతో ఐదుగురు విద్యార్థులపై హెచ్‌సీయూ గతంలో ఈ చర్య తీసుకుంది. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఈ ఐదుగురు విద్యార్థులు గతకొన్ని రోజులుగా వర్సిటీ ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమన్నారు. మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హెచ్‌సీయూ ఈ నిర్ణయం తీసుకుంది. -
రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ఆర్సీలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హెచ్ఆర్సీ స్పందించింది. వచ్చే నెల ఒకటవ తేదీ లోగా విద్యార్థి రోహిత్ మృతిపై నివేదిక సమర్పించాలని హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు, సైబరాబాద్ సీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. -
రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు
-
'హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలి'
-
'దత్తాత్రేయను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలి'
న్యూఢిల్లీ: దళిత పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హెచ్‌సీయూలో రోహిత్ మరణం అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి దత్తాత్రేయను వెంటనే కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా హెచ్‌సీయూ వీసీని, ఈ వ్యవహారంలో ప్రమేయమున్న వ్యక్తులను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ రాసిన లేఖ వల్లే వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో గచిబౌలి పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
స్మృతి ఇరానీ కార్యాలయం ముట్టడి!
-
స్మృతి ఇరానీ కార్యాలయం ముట్టడి!
న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో దళిథ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మతి ఇరానీ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు. వేముల రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్య అని విద్యార్థులు ఆరోపించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ స్మతి ఇరానీకి లేఖ రాయడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. -
'హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలి'
హైదరాబాద్: హెచ్‌సీయూలో దళిత పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై దర్యాప్తు జరుపాలని వారు డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో ఇప్పటివరకు జరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు వేముల రోహిత్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. దళిత విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వర్సిటీ వీసీపై చర్య తీసుకోవాలని కోరారు. అదేవిధంగా హెచ్‌యూసీలో విద్యార్థులపై విధించిన బహిష్కరణ చర్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలన్నారు. వర్సిటీలో సాంఘిక బహిష్కారం వంటి చర్యలు సరికావని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.