మరో రెండు జిల్లాల్లో వ్యవసాయ యంత్రాంగం ఉండదు
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సర్కారు యోచన
సాక్షి, హైదరాబాద్: అవసరం లేని చోట, పనిలేని చోట మొక్కుబడిగా శాఖల ఏర్పాటు.. కార్యాలయాలు, జిల్లా, మండల స్థాయి అధికారులు, వారికి వాహనాల ఏర్పాటు.. తదితర అంశాలతో వృథా అయ్యే వ్యయాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాల్లోని తొమ్మిది జిల్లాల్లో ఉద్యాన శాఖకు యంత్రాంగమే అవసరం లేదని అంచనా వేసింది. కొత్తగా ఏర్పాటుకానున్న 21 జిల్లాల్లో ఉద్యానశాఖకు ఏ మేరకు యంత్రాంగం అవసరమనే దానిపై సీఎం కేసీఆర్ వద్ద చర్చ జరిగింది. మొత్తం 31 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో ఉద్యానశాఖకు యంత్రాంగం అవసరం లేదని తేల్చినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడే భూపాలపల్లి జిల్లాలో 70 శాతం అడవులే ఉన్నాయని.. దానిని అటవీ శాఖ చూసుకుంటుంది కాబట్టి ఉద్యాన యంత్రాంగం అవసరం ఉండదనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి సేంద్రియ, కల్తీలేని ఆహార ఉత్పత్తులను సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 9 జిల్లాలకు ఉద్యాన వ్యవస్థే ఉండాల్సిన అవసరం లేదని భావించడంపై విమర్శలూ వస్తున్నాయి.
వరంగల్ అర్బన్, శంషాబాద్‌ల్లో వ్యవసాయశాఖ ఉండదు!
వ్యవసాయ శాఖలో 2 జిల్లాలకు యంత్రాంగం అవసరం లేదని సర్కారు భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోయే వరంగల్ అర్బన్, శంషాబాద్ జిల్లాలకు వ్యవసాయశాఖ యంత్రాంగం అనవసరమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ 2 జిల్లాల్లోని ఒకట్రెండు మండలాల్లో వ్యవసాయపరమైన అవసరాలుంటే ఒక ఏడీఏ స్థాయి అధికారిని ఉంచి ఆ శాఖను నడిపించాలని యోచిస్తున్నారు. మొత్తంగా ఉద్యాన, వ్యవసాయ శాఖలకు ఏయే జిల్లాల్లో యంత్రాంగం, మౌలిక సదుపాయాలు అవసరమో? ఎక్కడ అవసరం లేదో తక్షణమే నివేదిక ఇవ్వాలని సర్కారు వ్యవసాయ శాఖను ఆదేశించింది కూడా. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఉద్యాన, వ్యవసాయశాఖల విలీనం
జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత భావించినా.. తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్రస్థాయిలో మాత్రం ఆ మూడు శాఖలకు ఒకే కమిషనర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
తొమ్మిది జిల్లాల్లో ఉద్యాన శాఖకు నో!
Published Sat, Oct 8 2016 3:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement