
మాట్లాడుతున్న ఎస్.అయ్యప్పన్
హైదరాబాద్: రైతాంగ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని, వాటిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జనరల్, ఇంఫాల్ కేంద్రీయ వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్ పేర్కొన్నారు. అన్నదాతకు గౌరవం, లాభదాయకత పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2050 వరకు పెరిగే జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు ఆహార ఉత్పత్తి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న సహజ వనరుల కారణంగా ఆహార భద్రత చాలా కీలకాంశంగా మారిందని తెలిపారు. దీనికి తగ్గట్లుగా వ్యవసాయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న బిగ్‌డేటా ఎనాలసిస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితరాలను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టణ జనాభా అధికమవుతున్న పరిస్థితుల్లో పంటల సాగు విధానం కూడా మారాలని సూచించారు. వ్యవసాయం మరింత ఆకర్షణీయంగా, లాభదాయకంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అతి స్వల్ప కాలంలోనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అనేక అంశాల్లో పురోగతి సాధించిన నేపథ్యంలో ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు, సిబ్బందిని అయ్యప్పన్ అభినందించారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో 592 మంది యూజీ విద్యార్థులు, 144 మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 9 మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులతోపాటు 17 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.