రాయ్‌పూర్‌లో వీఎన్‌ఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు
సీతాఫలంతో ఐస్‌క్రీం.. ఒకే మొక్కకు టమాట, వంకాయలు.. ఏకంగా ఒక్కో ఎకరా భూమిలో 200 టన్నుల వంకాయ.. 40 టన్నుల మిర్చి.. 100 టన్నుల టమాటా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ సమీపంలోని గోముచి గ్రామంలో అనేక వ్యవసాయ ప్రయోగాలకు వేదికగా నిలిచిన ఓ రైతు వ్యవసాయ నర్సరీ ప్రత్యేకతలివి. నారాయణ చావ్‌డా అనే ఈ రైతు ఒకే మొక్కకు అంటుకట్టి వంకాయ, టమాటాలను పండిస్తున్నారు. మన రైతులు ఎకరా భూమిలో 20 టన్నులు కూడా వంకాయ పండించని స్థితిలో.. ఏకంగా 200 టన్నులు పండిస్తున్నారు. మిర్చి ఎకరానికి మన రైతులు 10 టన్నులు పండిస్తే.. తాను 40 టన్నులు, టమాటా మన వద్ద 20 టన్నులు కూడా పండించడం కష్టమైతే.. ఏకంగా 100 టన్నులు పండిస్తున్నారు.
ఇక యాపిల్ బేర్‌ను సాధారణ మొక్కగా మనం పెంచితే.. ఆయన పందిరి సాగు పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించి వచ్చింది. సాగులో ఇంత వైవిధ్యమైన, ఉత్తమ పద్ధతులు ఎక్కడా చూడలేదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ రంగంపై జరుగుతున్న స్థాయిలో ఇక్కడా వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు.
– సాక్షి, హైదరాబాద్
వేల ఎకరాలలో..
గోముచి గ్రామంలో నారాయణచావ్‌డా తన కుమారుడు విమల్ చావ్‌డాతో కలసి వ్యవసాయం చేస్తున్నారు. నారాయణ 1964లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో వ్యవసాయంలో బీఎస్సీ చేశారు. నాలుగేళ్లపాటు ఉద్యోగం చేశాక వ్యవసాయం మొదలుపెట్టారు. తొలుత 35 ఎకరాలతో ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఏకంగా.. ఐదు వేల ఎకరాల్లో భారీగా ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. ఇందుకోసం భూములను లీజుకు తీసుకున్నారు. వీఎన్‌ఆర్ పేరుతో పళ్లు, అన్ని రకాల కూరగాయలు, వరి విత్తనాలు, నర్సరీ మొక్కలు తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సీతాఫలం 300 ఎకరాల్లో, డ్రాగన్ ఫ్రూట్ 50 ఎకరాలు, యూపిల్ బేర్ 50 ఎకరాలు, జామ 200 ఎకరాలు, వరి విత్తన పంట 500 ఎకరాలు, నేరేడు చెట్లు 300 ఎకరాల్లో, వెయ్యి ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. సీతాఫలం సీజన్‌లో వచ్చే పళ్లను నేరుగా విక్రయించడంతోపాటు దాని గుజ్జును తీసి ఐస్‌క్రీం తయారుచేసి, విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఒక ఐస్‌క్రీం ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు. ఇక నెట్‌హౌజ్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తున్నారు. అందులోనే క్యాబేజీ, కాలీఫ్లవర్‌లను అంతరపంటగా వేశారు. దీనివల్ల ఆయా పంటలకు తెగుళ్లు సోకవని చెబుతున్నారు. నారాయణ సోదరులు ప్రవీణ్‌చావ్‌డా, రాజేశ్‌భాయ్ చావ్‌డాలు కూడా కరేలీబాగ్ అనే గ్రామంలో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుని జామ, వంకాయ, ఖర్జూర తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు నెలకొల్పి నాణ్యమైన విత్తనాలు విక్రయిస్తున్నారు.
వ్యవసాయ యంత్రాలు తెప్పించి..
దేశవిదేశాల్లో ఎక్కడ ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వచ్చినా.. వెంటనే వాటిని కొనుగోలు చేసి సాగుకు వినియోగిస్తున్నారు. అంటు కట్టేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన క్లిప్పులను ఇటలీ వెళ్లి కొనుగోలు చేశారు. వీఎన్‌ఆర్ క్షేత్రంలో రెండు వేల మంది వరకు పనిచేస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి పంటల సాగు పద్ధతులపై శిక్షణ పొందుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యానశాఖ కూడా సిబ్బందిని వారం రోజులపాటు శిక్షణకు పంపించాలని నిర్ణయించింది. ఈ శిక్షణకు ఒక్కొక్కరికి రూ.75 వేలు ఫీజుగా వసూలు చేస్తారు. వీఎన్‌ఆర్ క్షేత్రంలో పండిస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ వంకాయ, టమాటాలను అంటుకట్టి ఒకే మొక్కకు పండించేలా ఏర్పాట్లు చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.