అకాల వర్షాల నష్టంపై రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్లు, అకాల వర్షాల కారణంగా 10,760 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ప్రధానంగా వ్యవసాయ పంటలకు 7,762 ఎకరాల్లో, ఉద్యాన పంటలకు 2,998 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. రంగారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి, పెద్దపల్లి, కరీంనగర్, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 75 గ్రామాల్లో నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ బుధవారం పేర్కొంది. మామిడి తోటలకు 2,324 ఎకరాల్లో, కూరగాయల తోటలకు 577 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మిరప, అరటి, సపోట, ద్రాక్ష తదితర తోటలకూ నష్టం జరిగింది.
ఉద్యాన పంటలకు రూ.2.05 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ వెల్లడించింది. వరికి 2,032 ఎకరాల్లో, మొక్కజొన్నకు 5,655 ఎకరాల్లో నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ తెలిపింది. మరోవైపు సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగళ్ల వానలకు గ్రీన్‌హౌస్‌లు ధ్వంసమయ్యాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి గ్రామంలో ఎల్లారెడ్డి అనే రైతు అరెకరంలో జెరబిర పూల సాగు చేపట్టారు. వడగళ్ల వానలకు గ్రీన్‌హౌస్ పూర్తిగా ధ్వంసమైందని, దీంతో రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాగే కీసరలోనూ ఒక రైతు గ్రీన్‌హౌస్ పూర్తిగా ధ్వంసమైంది. ఇలా కొన్నిచోట్ల గ్రీన్‌హౌస్ నిర్మాణాలు కూలిపోయాయి. పాలీషీట్లు చిరిగిపోయాయి. అయితే కొన్నింటికి బీమా సౌకర్యం ఉన్నా మొదటి ఏడాదికే పరిమితం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గ్రీన్‌హౌస్‌పై వేసే పాలీషీట్‌కు కేవలం ఏడాదికే బీమా సౌకర్యం ఉంది. ఏడాది దాటితే వాటికి బీమా పరిహారం ఉండదని రైతులు చెబుతున్నారు.
మూడు రోజులు వడగళ్ల వర్షాలు..
మరో మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నష్టం వివరాలను అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
10 వేల ఎకరాల్లో పంట నష్టం
Published Thu, Mar 9 2017 12:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement