సీపీ-పీసీ ఇద్దరికీ ఇన్నోవానే !
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వసతులు కలిగిన పోలీసు వాహనాలు జంట కమిషనరేట్లలో పరుగులు తీయనున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం కొత్తవాహనాలను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమంలో వంద ఇన్నోవా వాహనాలు, 476 ద్విచక్ర వాహనాలను సీఎం జంట కమిషనరేట్లకు అందజేశారు. నిన్నటి వరకు నగర పోలీసు కమిషనరేట్‌లో కేవలం రెండు ఇన్నోవా వాహనాలు మాత్రమే ఉండేవి నేడు ఆ సంఖ్య 52కు చేరాయి. ఇక నుంచి పోలీస్ కమిషనర్, కానిస్టేబుళ్లు ఇన్నోవా వాహనంలో తిరగనున్నారు.
కొత్త వాహ నాలు పంపిణీ ఇలా..
నగర పోలీసులకు అందిన కొత్త వాహనాలలో వెస్ట్‌జోన్‌కు ఆరు, ఈస్ట్‌జోన్‌కు మూడు, సెంట్రల్ జోన్‌కు నాలుగు, నార్త్‌జోన్‌కు నాలుగు, ట్రాఫిక్ విభాగానికి 12 కేటాయించారు. మరో 18 వాహనాలు జిల్లాలకు వెళ్లాయి. పద్రాగస్టు వేడుకల తరువాత తిరిగి ఇవి నగర కమిషనరేట్‌కు చేరుకోనున్నాయి. 268 ద్విచక్ర వాహనాలు బ్లూకోట్స్ పోలీసులకు ఇచ్చారు. ఇక సైబరాబాద్‌కు 50 ఇన్నోవా వాహనాలు, 208 ద్విచక్ర వాహనాలు చేరుకున్నాయి.
వాహనంలో సదుపాయాలు ...
పోలీసు డ్రైవర్, ఎస్‌ఐతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు.
వాహనంలో ఉండే సౌకర్యాలు....
* ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన చిన్నపాటి ట్యాబ్
* డిజిటల్ కెమెరా
* వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు.
* కమ్యూనికేషన్ సిస్టమ్ (వెరి హై ఫ్రీక్వెన్సీ)
* వాహనంపై నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో పాటు సైరన్
* సీసీ కెమెరా మైక్ సిస్టం
* ఆయుధాలు, లాఠీలు పెట్టుకునే సదుపాయం