safe city project
-
హైదరాబాద్ ఓఆర్ఆర్పై డ్రంకెన్ డ్రైవ్‌లు.. ఇక అడుగడుగునా నిఘా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీసు కమిషనరేట్ రాచకొండలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రానుంది. నిర్భయ, ఐటీఎంఎస్, నేను సైతం కార్యక్రమాల కింద ఏర్పాటైన సుమారు లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో రాచకొండలో అడుగడుగునా నిఘా ఉండనుంది. ఇప్పటికే కేంద్రం హోం శాఖకు చెందిన సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను పంపించామని కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. సుమారు 50 మంది సిబ్బంది 24/7 కంట్రోల్ సెంటర్లో విధుల్లో ఉంటారని, జోన్ల వారీగా ప్రత్యేక నిఘా ఉంటుందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..ఔటర్లో డ్రంకెన్ డ్రైవ్‌లు.. పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుంది. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం (ఆప్ట్)ను ఏర్పాటు చేశాం. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు, దర్యాప్తులతో పాటు సమాంతరంగా ప్రమాదం జరిగిన తీరు, కారణాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషించడం, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించడం దీని బాధ్యత. ఓఆర్ఆర్పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) నిర్వహిస్తున్నాం.3 షిఫ్ట్‌లలో సిబ్బందికి విధులు.. సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటివరకు రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బందికి మూడు షిఫ్ట్‌లను కేటాయించాం. దీంతో 74 పెట్రోలింగ్ వాహనాల సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తారు. తగినంత స్థాయిలో నియామకాలు జరిగిన తర్వాత పోలీసు స్టేషన్లలో కూడా మూడు షిఫ్ట్‌ల విధానాన్ని అమలు చేస్తాం.సైబర్ బాధితులకు ఊరట.. క్విక్ రెస్పాన్స్, విజుబుల్ పోలీసింగ్, సాంకేతికత.. ఈ మూడే రాచకొండ పోలీసుల ప్రాధాన్యం. దీంతోనే నేరాలు తగ్గడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 7 నెలల్లో రూ.15 కోట్ల సొమ్మును బాధితులకు రీఫండ్ చేశాం. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తే బాధితులకు ఊరట కలగడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.చదవండి: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా.. తల్లిదండ్రులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలుపోలీసు ప్రవర్తనపై నిఘా.. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు వంద బాడీవార్న్ కెమెరాలను కొనుగోలు చేశాం. కమిషనరేట్‌లోని 12 ఠాణాల్లోని ఎస్ఐ ర్యాంకు అధికారికి వీటిని ధరించి విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఈ బాడీవార్న్ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. దీంతో వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతుంటుంది.మహిళల భద్రత కోసం.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2 నెలల్లో ఎల్బీనగర్, భువనగిరిలో భరోసా సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిల్లో తగినంత మహిళా సిబ్బందితో పాటు శాశ్వత కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నాం. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఆయా విభాగాల్లో మహిళా సిబ్బందిని పెంచుతున్నాం. మహిళలను వేధింపులు పునరావృతమైతే ఆయా నిందితులపై రౌడీ షీట్లు తెరుస్తున్నాం. ఇందుకోసం ప్రతీ పోలీసు స్టేషన్లో రిజిస్ట్రీ ఉంటుంది. -
Hyderabad: ఆమె కోసం.. ఎలక్ట్రిక్ మొబైల్ టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మహిళల సదుపాయార్థం ఇప్పటికే షీ టాయ్లెట్లు, మొబైల్ టాయ్లెట్లు వంటివి అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల మొబైల్ టాయ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ మెట్రో నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల కోసం ‘నిర్భయ’ ఫండ్స్ నుంచి నిధులు అందజేస్తోంది. అలా అందిన నిధులతో మహిళల మొబైల్ టాయ్లెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సమకూర్చుకున్న పోలీసు శాఖ.. వాటి నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించింది. గ్రేటర్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఉంచారు. సికింద్రాబాద్ జోన్లో 3 వాహనాలు, ఎబీనగర్‌లో జోన్లో 3, ఖైరతాబాద్‌జోన్‌లో 2, చారి్మనార్ జోన్లో 2, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్ మొబైల్ బస్సులను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్, ధర్నాచౌక్, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్రగతిభవన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీని బట్టి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితోపాటు శానిటరీ నాప్కిన్స్ వంటివి ఉంటాయని పేర్కొన్నారు. షీ గెస్ట్‌హౌస్.. సేఫ్‌సిటీ ద్వారా అందే నిధులతో నగరంలో మహిళా యాత్రికుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌ను కూడా నిర్మించనున్నారు. నాంపల్లి సరాయి వద్ద 1900 చదరపుగజాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయంతోపాటు అయిదంతస్తులతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ పాలకమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. మొత్తం 187 బెడ్స్ కలిగి ఉండే గెస్ట్‌హౌస్‌లో సింగిల్ బెడ్స్, షేరింగ్ బెడ్స్ ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లో ఏసీతోపాటు వైఫై, లాకర్లు, లిఫ్టులు, ఇంటర్నెట్ కియోస్క్‌లు, ఎమర్జెన్సీ క్లినిక్ తదితర సదుపాయాలుంటాయి. అంచనా వ్యయం రూ.11 కోట్లు. (చదవండి: ‘ఫార్మా’లిటీస్ దందా! ) -
సేఫ్ సిటీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళా భద్రత కోసం ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దిశ ఘటనతో ఈ ప్రాజెక్టు అమలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో సేఫ్‌సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ నగరాలను ఎంపిక చేసింది. అంతర్జాతీయ ప్రాజెక్టులు, ఐటీ, ఫార్మా, తదితర రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీలకోసం మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి భద్రత కోసం ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని చేపడతాయి. ఇందుకోసం ప్రతి నగరానికి రూ.280 కోట్లు వెచ్చించాలి. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఏమేం చేస్తారు..? ఈ ప్రాజెక్టు అమలులో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, విమెన్‌సేఫ్టీ వింగ్, ఐజీ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఈ ప్రాజెక్టుకు ఐజీ స్వాతి లక్రా కన్వీనర్‌గా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మహిళల భద్రతకోసం అదనంగా 3వేల సీసీ కెమెరాలు బిగించాలి. రాత్రిపూట మహిళల రవాణా కోసం ప్రత్యేక బస్సులు, క్యాబ్‌లు నడపాలి. అందులో సీసీ కెమెరాలు అమర్చాలి. మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, అదనంగా మహిళా పోలీసుల రిక్రూట్మెంట్, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. అయితే దీనిపై పలుమార్లు సమావేశమయ్యారే తప్ప.. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు కోసం చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక నిధుల విషయానికి వస్తే.. రూ.282 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.138 కోట్ల మేర పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులు ప్రస్తుతం నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నిదానంగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే పూర్తవుతాయని చెబుతున్నారు. -
ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ @ 112
న్యూఢిల్లీ: ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ను మంగళవారం 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘112’ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయడానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో నిర్భయ ఫండ్ కింద రూ.2,919 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఎఆర్‌ఎస్‌ఎస్) కింద ప్రవేశపెట్టిన 112 హెల్ప్‌లైన్ కింద ప్రస్తుతం పోలీసు (100), ఫైర్ (101), మహిళల హెల్ప్‌లైన్ (1090)లను అనుసంధానించగా, త్వరలోనే హెల్త్ హెల్ప్‌లైన్ (108)ను కూడా చేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కశ్మీర్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. -
‘సేఫ్’ టెక్నాలజీ
ఆధునిక జీవనంలో కీలకంగా మారిన సాంకేతికత.. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది.. క్షణాల్లో నేరగాళ్లను గుర్తించి వారి ఆటకట్టించడానికి దోహదపడుతుంది.. సూరత్‌లో దూసుకుపోతున్న ‘ఈ’ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ పలు నగరాలను ఆకర్షిస్తోంది. * రోల్ మోడల్‌గా సూరత్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ * దేశంలోనే తొలి సేఫ్ సిటీ ప్రాజెక్టుగా ప్రారంభం * పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్- పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మాణం సూరత్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలని ఆరు నెలల క్రితం సేఫ్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గుజరాత్ ఆర్థిక రాజధాని సూరత్‌లో ఈ ఆలోచన నాలుగేళ్ల క్రితమే, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకంటే ముందుగానే వచ్చింది. అక్కడి పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా చొరవతో ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకుసాగుతోంది. దేశంలోనే తొలి, ప్రతిష్టాత్మకమైన ‘సురక్షా సేథు’గా పిలిచే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆలోచన ఇలా.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2011 జూలై 13న మూడు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో ఒకటి వజ్రాల వ్యాపార కేంద్రమైన జువేరీ బజార్‌ను టార్గెట్‌గా చేసుకుని జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానా సూరత్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ సైతం మరోసారి ఉగ్రవాదుల టార్గెట్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన భావించారు. అలాగే ట్రాఫిక్ సిబ్బంది కొరతతో ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అలా మొదలైందే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’. ట్రస్ట్ ఏర్పాటుతో.. ప్రాజెక్టులో భాగంగా నగర వ్యాప్తంగా కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) రూపకల్పనకు నిర్ణయించారు. నిధుల కోసం 2012 సెప్టెంబర్‌లో సూరత్‌లోని వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి పథకాన్ని వివరించారు. దీంతో అక్కడికక్కడే రూ.ఐదు కోట్ల విరాళాలు అందాయి. ప్రాజెక్టు పనుల కోసం రాకేష్ ఆస్తానా సాంకేతిక నిపుణులు, వ్యాపారులతో ‘ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లో మొదటి దశ.. ఈ ట్రస్ట్ ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ ప్రాజెక్టు సాంకేతిక అంశాలను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన ‘ఇన్నోవేటివ్ టెలికం అండ్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ వాస్తవ ధరలకే ప్రాజెక్టు చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఫలితంగా కేవలం రూ.16.5 కోట్లతో తొలిదశ ప్రాజెక్టు మూడు నెలల్లోనే పూర్తయింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది జనవరి 18న దీన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న రెండు దశల్లో సూరత్‌లోని 97 ప్రాంతాల్లో 604 కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 24 పీటీజెడ్ పరిజ్ఞానంతో కూడినవి. ఈ కెమెరాల ద్వారా కనిపించే దృశ్యాలను చూడటానికి సీసీసీలో 280 చదరపు అడుగుల డిజిటల్ వీడియో వాల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు కేవలం రూ.35 కోట్లు. మరో మూడేళ్లలో సూరత్ వ్యాప్తంగా 5 వేల కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’ ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీపీ) మోడల్‌గా అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. స్ఫూర్తిదాయకంగా ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థ... దాదాపు 50 లక్షల జనాభా, 30 లక్షల వాహనాలు ఉన్న సూరత్‌లో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య కేవలం 300 మాత్రమే. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడ ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది కనీస విద్యార్హత కలిగిన వారిని ఎంపిక చేసుకుని ప్రాథమిక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ నియంత్రణకు వినియోగిస్తున్నారు. వీరికి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల నుంచే జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సీసీసీ అందుబాటులోకి వచ్చిన తరవాత 80 శాతం హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులు పోలీసులకు చిక్కుతున్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డేటాబేస్ రూపొందిస్తున్న సీసీసీ త్వరలో వారి లెసైన్సులు రద్దు చేసే దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. నైట్ విజన్, జూమ్ కెమెరాలు.. సూరత్ రహదారులపై ప్రతి కిలోమీటరుకు ఓ కెమెరా నిఘా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కెమెరా గరిష్టంగా 760 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ముఖాన్ని పగలు, రాత్రి సైతం స్పష్టంగా చూపిస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న వాహనం నెంబర్ ప్లేట్‌ను జూమ్ చేసి చూపిస్తుంది. వీటి ద్వారా సూరత్ పోలీసులు గత ఏడాది నేరాలను 23 శాతం తగ్గించగలిగారు. దీనికి అనుసంధానంగా ‘డయల్-100’, మహిళా హెల్ప్‌లైన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ తదితరాలను సీసీసీలో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఇక్కడ నుంచే గుర్తించి, వారి చిరునామాకు ఈ-చలాన్‌ను పంపుతారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకు 2,67,446 చలాన్లు జారీ చేసి రూ.2,54,86,600 వసూలు చేశారు. మరో ఆరు నెలల్లో.. సూరత్ సీసీసీని ఆధునీకరిస్తున్న అక్కడి అధికారులు మరో ఆరు నెలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి వివరాలు.. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం.. సీసీసీలోని సర్వర్‌లో పాత నేరగాళ్లు, వాంటెడ్, మిస్సింగ్ వ్యక్తుల ఫొటోలను నిక్షిప్తం చేయనున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమైన నగరంలోని ఏ కెమెరా ముందుకైనా వారు వస్తే, వెంటనే కంప్యూటర్ గుర్తించి ఆ వివరాలను సీసీసీలోని సిబ్బందికి తెలియజేస్తుంది. సస్పీషియస్ అలార్మింగ్.. సీసీసీలోని ప్రత్యేక ప్రోగ్రాంతో ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్ గుర్తించి సమాచారాన్ని ప్రత్యేక అలారమ్ ద్వారా సిబ్బందికి చేరవేస్తుంది. ఏఎన్పీఆర్ వ్యవస్థ.. ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టం (ఏఎన్పీఆర్) ఇది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాటితో పాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి కంప్యూటర్ ద్వారా కెమెరాలను అనుసంధానిస్తున్నారు. దీంతో ఆయా వాహనాలు నగరంలో ఎక్కడ తిరిగినా కెమెరాలు గుర్తించి సీసీసీలో ఉన్న వారిని అప్రమత్తం చేస్తాయి. సిట్యుయేషన్ మేనేజ్మెంట్ సూరత్ నగర వ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానమైన కెమెరాలు గుర్తించి సీసీసీలో ఉన్న కంప్యూటర్లో ప్రత్యేక పాప్అప్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇస్తాయి. ఘటన జరిగిన ప్రదేశంతో పాటు దానికి సమీపంలో ఉన్న పోలీసు గస్తీ వాహనాల వివరాలనూ తెలియజేస్తాయి. -
సీపీ-పీసీ ఇద్దరికీ ఇన్నోవానే !
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక వసతులు కలిగిన పోలీసు వాహనాలు జంట కమిషనరేట్లలో పరుగులు తీయనున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం కొత్తవాహనాలను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమంలో వంద ఇన్నోవా వాహనాలు, 476 ద్విచక్ర వాహనాలను సీఎం జంట కమిషనరేట్లకు అందజేశారు. నిన్నటి వరకు నగర పోలీసు కమిషనరేట్‌లో కేవలం రెండు ఇన్నోవా వాహనాలు మాత్రమే ఉండేవి నేడు ఆ సంఖ్య 52కు చేరాయి. ఇక నుంచి పోలీస్ కమిషనర్, కానిస్టేబుళ్లు ఇన్నోవా వాహనంలో తిరగనున్నారు. కొత్త వాహ నాలు పంపిణీ ఇలా.. నగర పోలీసులకు అందిన కొత్త వాహనాలలో వెస్ట్‌జోన్‌కు ఆరు, ఈస్ట్‌జోన్‌కు మూడు, సెంట్రల్ జోన్‌కు నాలుగు, నార్త్‌జోన్‌కు నాలుగు, ట్రాఫిక్ విభాగానికి 12 కేటాయించారు. మరో 18 వాహనాలు జిల్లాలకు వెళ్లాయి. పద్రాగస్టు వేడుకల తరువాత తిరిగి ఇవి నగర కమిషనరేట్‌కు చేరుకోనున్నాయి. 268 ద్విచక్ర వాహనాలు బ్లూకోట్స్ పోలీసులకు ఇచ్చారు. ఇక సైబరాబాద్‌కు 50 ఇన్నోవా వాహనాలు, 208 ద్విచక్ర వాహనాలు చేరుకున్నాయి. వాహనంలో సదుపాయాలు ... పోలీసు డ్రైవర్, ఎస్ఐతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. వాహనంలో ఉండే సౌకర్యాలు.... * ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన చిన్నపాటి ట్యాబ్ * డిజిటల్ కెమెరా * వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. * కమ్యూనికేషన్ సిస్టమ్ (వెరి హై ఫ్రీక్వెన్సీ) * వాహనంపై నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో పాటు సైరన్ * సీసీ కెమెరా మైక్ సిస్టం * ఆయుధాలు, లాఠీలు పెట్టుకునే సదుపాయం