సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళా భద్రత కోసం ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దిశ ఘటనతో ఈ ప్రాజెక్టు అమలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో సేఫ్‌సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ నగరాలను ఎంపిక చేసింది.
అంతర్జాతీయ ప్రాజెక్టులు, ఐటీ, ఫార్మా, తదితర రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీలకోసం మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి భద్రత కోసం ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని చేపడతాయి. ఇందుకోసం ప్రతి నగరానికి రూ.280 కోట్లు వెచ్చించాలి. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి.
ఏమేం చేస్తారు..?
ఈ ప్రాజెక్టు అమలులో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, విమెన్‌సేఫ్టీ వింగ్, ఐజీ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఈ ప్రాజెక్టుకు ఐజీ స్వాతి లక్రా కన్వీనర్‌గా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మహిళల భద్రతకోసం అదనంగా 3వేల సీసీ కెమెరాలు బిగించాలి. రాత్రిపూట మహిళల రవాణా కోసం ప్రత్యేక బస్సులు, క్యాబ్‌లు నడపాలి. అందులో సీసీ కెమెరాలు అమర్చాలి.
మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, అదనంగా మహిళా పోలీసుల రిక్రూట్‌మెంట్, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. అయితే దీనిపై పలుమార్లు సమావేశమయ్యారే తప్ప.. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు కోసం చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక నిధుల విషయానికి వస్తే.. రూ.282 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.138 కోట్ల మేర పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులు ప్రస్తుతం నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నిదానంగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే పూర్తవుతాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment