‘సేఫ్’ టెక్నాలజీ | safe technology in hyderabad | Sakshi
Sakshi News home page

‘సేఫ్’ టెక్నాలజీ

Published Mon, Dec 15 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

‘సేఫ్’ టెక్నాలజీ

‘సేఫ్’ టెక్నాలజీ

ఆధునిక జీవనంలో కీలకంగా మారిన సాంకేతికత.. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది..  క్షణాల్లో నేరగాళ్లను గుర్తించి వారి ఆటకట్టించడానికి దోహదపడుతుంది.. సూరత్‌లో దూసుకుపోతున్న ‘ఈ’ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ పలు నగరాలను ఆకర్షిస్తోంది.
 

* రోల్ మోడల్‌గా సూరత్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
* దేశంలోనే తొలి సేఫ్ సిటీ ప్రాజెక్టుగా ప్రారంభం
* పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్- పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో నిర్మాణం


సూరత్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలని ఆరు నెలల క్రితం సేఫ్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గుజరాత్ ఆర్థిక రాజధాని సూరత్‌లో ఈ ఆలోచన నాలుగేళ్ల క్రితమే, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకంటే ముందుగానే వచ్చింది. అక్కడి పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా చొరవతో ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకుసాగుతోంది.  దేశంలోనే తొలి, ప్రతిష్టాత్మకమైన ‘సురక్షా సేథు’గా పిలిచే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 
ఆలోచన ఇలా..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2011 జూలై 13న మూడు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో ఒకటి వజ్రాల వ్యాపార కేంద్రమైన జువేరీ బజార్‌ను టార్గెట్‌గా చేసుకుని జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానా సూరత్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ సైతం మరోసారి ఉగ్రవాదుల టార్గెట్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన  భావించారు. అలాగే ట్రాఫిక్ సిబ్బంది కొరతతో ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అలా మొదలైందే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’.
 
ట్రస్ట్ ఏర్పాటుతో..
ప్రాజెక్టులో భాగంగా నగర వ్యాప్తంగా కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) రూపకల్పనకు నిర్ణయించారు. నిధుల కోసం 2012 సెప్టెంబర్‌లో సూరత్‌లోని వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి పథకాన్ని వివరించారు. దీంతో అక్కడికక్కడే రూ.ఐదు కోట్ల విరాళాలు అందాయి. ప్రాజెక్టు పనుల కోసం రాకేష్ ఆస్తానా  సాంకేతిక నిపుణులు, వ్యాపారులతో ‘ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు.
 
మూడు నెలల్లో మొదటి దశ..
ఈ ట్రస్ట్ ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ ప్రాజెక్టు సాంకేతిక అంశాలను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన ‘ఇన్నోవేటివ్ టెలికం అండ్ సాఫ్ట్‌వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ వాస్తవ ధరలకే ప్రాజెక్టు చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఫలితంగా కేవలం రూ.16.5 కోట్లతో తొలిదశ ప్రాజెక్టు మూడు నెలల్లోనే పూర్తయింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది జనవరి 18న దీన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న రెండు దశల్లో సూరత్‌లోని 97 ప్రాంతాల్లో 604 కెమెరాలు ఏర్పాటయ్యాయి.

వీటిలో 24 పీటీజెడ్ పరిజ్ఞానంతో కూడినవి. ఈ  కెమెరాల ద్వారా కనిపించే దృశ్యాలను చూడటానికి సీసీసీలో 280 చదరపు అడుగుల డిజిటల్ వీడియో వాల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు కేవలం రూ.35 కోట్లు. మరో మూడేళ్లలో సూరత్ వ్యాప్తంగా 5 వేల కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’ ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీపీ) మోడల్‌గా అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.

స్ఫూర్తిదాయకంగా ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థ...
దాదాపు 50 లక్షల జనాభా, 30 లక్షల వాహనాలు ఉన్న సూరత్‌లో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య కేవలం 300 మాత్రమే. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడ ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది కనీస విద్యార్హత కలిగిన వారిని ఎంపిక చేసుకుని ప్రాథమిక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ నియంత్రణకు వినియోగిస్తున్నారు.

వీరికి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల నుంచే జీతభత్యాలు చెల్లిస్తున్నారు.  సీసీసీ అందుబాటులోకి వచ్చిన తరవాత 80 శాతం హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులు పోలీసులకు చిక్కుతున్నారు.  పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డేటాబేస్ రూపొందిస్తున్న సీసీసీ త్వరలో వారి లెసైన్సులు రద్దు చేసే దిశగా చర్యలకు సిద్ధమవుతోంది.
 
నైట్ విజన్, జూమ్  కెమెరాలు..
సూరత్ రహదారులపై ప్రతి కిలోమీటరుకు ఓ కెమెరా నిఘా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కెమెరా గరిష్టంగా 760 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ముఖాన్ని పగలు, రాత్రి సైతం స్పష్టంగా చూపిస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న వాహనం నెంబర్ ప్లేట్‌ను జూమ్ చేసి చూపిస్తుంది.

వీటి ద్వారా సూరత్ పోలీసులు గత ఏడాది నేరాలను 23 శాతం తగ్గించగలిగారు.  దీనికి అనుసంధానంగా ‘డయల్-100’, మహిళా హెల్ప్‌లైన్, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ తదితరాలను సీసీసీలో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఇక్కడ నుంచే గుర్తించి, వారి చిరునామాకు ఈ-చలాన్‌ను పంపుతారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకు  2,67,446 చలాన్లు జారీ చేసి రూ.2,54,86,600 వసూలు చేశారు.
 
మరో ఆరు నెలల్లో..
సూరత్ సీసీసీని ఆధునీకరిస్తున్న అక్కడి అధికారులు మరో ఆరు నెలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి వివరాలు..
 
ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం..
సీసీసీలోని సర్వర్‌లో పాత నేరగాళ్లు, వాంటెడ్, మిస్సింగ్ వ్యక్తుల ఫొటోలను నిక్షిప్తం చేయనున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమైన నగరంలోని ఏ కెమెరా ముందుకైనా వారు వస్తే, వెంటనే కంప్యూటర్ గుర్తించి ఆ వివరాలను సీసీసీలోని సిబ్బందికి తెలియజేస్తుంది.
 
సస్పీషియస్ అలార్మింగ్..
సీసీసీలోని ప్రత్యేక ప్రోగ్రాంతో ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్  గుర్తించి  సమాచారాన్ని ప్రత్యేక అలారమ్ ద్వారా సిబ్బందికి చేరవేస్తుంది.
 
ఏఎన్‌పీఆర్ వ్యవస్థ..
ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టం (ఏఎన్‌పీఆర్) ఇది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాటితో పాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి కంప్యూటర్ ద్వారా కెమెరాలను అనుసంధానిస్తున్నారు. దీంతో ఆయా వాహనాలు నగరంలో ఎక్కడ తిరిగినా  కెమెరాలు గుర్తించి సీసీసీలో ఉన్న వారిని అప్రమత్తం చేస్తాయి.
 
సిట్యుయేషన్ మేనేజ్‌మెంట్
సూరత్ నగర వ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానమైన కెమెరాలు గుర్తించి సీసీసీలో ఉన్న కంప్యూటర్‌లో ప్రత్యేక పాప్‌అప్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇస్తాయి. ఘటన జరిగిన ప్రదేశంతో పాటు దానికి సమీపంలో ఉన్న పోలీసు గస్తీ వాహనాల వివరాలనూ తెలియజేస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement