రెండో విడత కింద అనుమతించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండో విడతగా 15,518 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.1,298.95 కోట్ల అంచనా వ్యయంతో మహా నగర పరిధిలోని 36 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ మంగళవారం పరిపాలనపరమైన అనుమతులు జారీ చేశారు. ఈ ఇళ్ల నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం రూ.1,202.75 కోట్లను సబ్సిడీగా కేటాయించనుండగా, జీహెచ్‌ఎంసీ రూ.96.23 కోట్ల అదనపు వ్యయాన్ని భరించనుంది. రూ.7 లక్షల అంచనా వ్యయంతో ఒక్కో ఇంటిని నిర్మించనున్నారు.
12 చోట్లలో 9 అంతస్తుల భవనాల నమూనాతో 8,476 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఒక్కో ఇంటిపై అదనంగా మరో రూ.90 వేలను ఖర్చు చేయనున్నారు. మరో 6 చోట్లలో 2,660 ఇళ్లను ఐదంతస్తుల భవనాల నమూనాలో నిర్మించనుండగా, ఒక్కో ఇంటిపై రూ.75 వేల అదనపు వ్యయం చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రెండోవిడత ఇళ్ల నిర్మాణాన్ని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గృహ నిర్మాణ శాఖ బడ్జెట్ కేటాయింపుల నుంచి, ఇతరత్రా మార్గాల్లో సేకరించిన రుణాలతో ఈ ఇళ్ల నిర్మాణానికి నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలోని 18 ప్రాంతాల్లో రూ.390.97 కోట్ల వ్యయంతో తొలి విడతగా 5,050 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి గత ఆగస్టు 26న ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం విదితమే.
గ్రేటర్‌లో 15,518 ‘డబుల్’ ఇళ్లు
Published Wed, Nov 2 2016 2:51 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement