నకిలీ ‘చీడ’ ఇక విరగడ! | telangana govt serious action on duplicate seeds selling | Sakshi
Sakshi News home page

నకిలీ ‘చీడ’ ఇక విరగడ!

Published Sun, Nov 6 2016 2:44 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

నకిలీ ‘చీడ’ ఇక విరగడ! - Sakshi

నకిలీ ‘చీడ’ ఇక విరగడ!

► రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే ఇకపై కఠిన చర్యలు
► బిల్లుకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం
► వచ్చే సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు
► జైలుశిక్షతోపాటు కంపెనీల నుంచి రైతులకు పరిహారం
► కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలు
► నష్టపోయిన రైతులు ఈ కమిటీని ఆశ్రయించవచ్చు
► అప్పిలేట్‌ అథారిటీగా రాష్ట్రస్థాయిలో మరో కమిటీ
► బిల్లు చట్టరూపం దాల్చాక శిక్షలపై మార్గదర్శకాలు


సాక్షి, హైదరాబాద్‌: రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు అంటగట్టే కంపెనీలు, డీలర్లపై ఇకపై కఠిన చర్యలు తప్పవు! జైలు శిక్షతోపాటు వారి నుంచి రైతులకు భారీమొత్తంలో పరిహారం ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బిల్లును రూపొందించింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాదించి చట్టం రూపంలోకి తీసుకురానుంది. కేంద్ర విత్తన చట్టం–1966కు అనుగుణంగా తెలంగాణ రైతు ఫిర్యాదుల పరిష్కార (నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగినప్పుడు) చట్టం–2016 ముసాయిదాకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.

వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఈ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రకారం నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు చేపడతారు. బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత.. నష్టపరిహారం, జైలు శిక్షలపై స్పష్టత రానుంది. పరిస్థితిని బట్టి పరిహారంతోపాటు జైలు శిక్ష కూడా ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించనున్నారు. ఇటీవల నకి లీ మిరప విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నష్టపోయారు. అవి నకిలీ విత్తనాలేనని సర్కారు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేలా... వారికి నష్టపరిహారం ఇప్పించేలా చట్టం తీసుకు రావాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో సర్కారు నూతన చట్టం దిశగా కసరత్తు చేస్తోంది.

జిల్లా కమిటీకే అధికారం
నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టం జరిగితే విత్తన కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే అంశం కేంద్ర విత్తన చట్టంలో లేదు. అయితే 2007లో ఉమ్మడి రాష్ట్రంలో పత్తి పంటకు నష్టం జరిగితే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించేలా ఏపీ కాటన్‌ సీడ్స్‌ యాక్ట్‌–2007ను తీసుకొచ్చారు. ఇది నకిలీ పత్తి విత్తనాలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో ఇతర పంట విత్తనాల్లో మోసం జరిగితే పరిహారం ఇప్పించేందుకు కొత్త చట్టం అవసరమైంది. తాజాగా రూపొందించిన ముసాయిదా ప్రకారం.. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో జిల్లా వ్యవసాయాధికారి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా ఉద్యానాధికారి, సంబంధిత పంటకు సంబంధించిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు, విత్తన ఉత్పత్తిదారులు సభ్యులుగా ఉంటారు. నకిలీ విత్తనాలతో ఏ పంటకు నష్టం వాటిల్లినా జిల్లా కమిటీనే పరిహారం ఇప్పిస్తుంది. నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగిన రైతు వ్యవసాయ క్షేత్రాల్లో ఈ కమిటీ పర్యటిస్తుంది. రైతుకు ఎంత నష్టం జరిగింది? దాని విలువ ఎంత? అనేది కమిటీనే అంచనా వేస్తుంది. ఆ ప్రకారం కంపెనీలను పిలిపించి పరిహారం ఇప్పిస్తుంది. శిక్షలను కూడా ఖరారు చేస్తుంది.

అప్పీలుకు అవకాశం
జిల్లాస్థాయి కమిటీలో రైతు తనకు సరైన న్యాయం జరగలేదని భావించినా... విత్తన సరఫరాదారు కూడా అలాగే యోచించినా రాష్ట్రస్థాయి కమిటీకి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయశాఖ కమిషనర్‌ నేతృత్వం వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ పరిశోధన విభాగాల డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ విత్తన విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అప్పిలేట్‌ అథారిటీగా పనిచేస్తుంది. జిల్లా కమిటీలో తీసుకున్న నిర్ణయాలపై రెండు వర్గాల వాదనలను ఇది పరిగణలోకి తీసుకుంటుంది. అవసరమైతే జిల్లాస్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో కొద్దిపాటి మార్పుచేర్పులు చేసి తుది నిర్ణయం ప్రకటిస్తుంది. దాన్ని ఇరువర్గాలూ పాటించాల్సిందే.

బిల్లులోని ఇతర ముఖ్యాంశాలు...
► పత్తికి ప్రత్యేక చట్టం ఉన్నందున ఆ పంటకు ఈ నూతన చట్టం వర్తించదు. మిరప, వరి, మొక్కజొన్న తదితర అన్ని పంటలకూ వర్తిస్తుంది
► నకిలీ విత్తనాలతో తనకు నష్టం వాటిల్లిందని రైతు లేదా రైతు బృందం భావిస్తే జిల్లా కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వొచ్చు
► ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత శిక్షలు, పరిహారం వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేసి మార్గదర్శకాలు జారీ చేస్తుంది. చట్టంలోనే శిక్షలు, పరిహారం వంటి అంశాల ప్రస్తావన ఉండదు. కఠిన శిక్షలు అని మాత్రమే ప్రస్తావిస్తారు
► ఈ చట్టం మూడేళ్లపాటు అమలు చేశాక అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని తొలగిస్తారు. అవసరాన్ని బట్టి మరికొన్నింటిని జోడిస్తారు
► రైతుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన అధికారి, ఉద్యోగి, ఏజెన్సీ, డీలరు ఇలా ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకునేలా చట్టం ఉంటుంది
► జిల్లా లేదా రాష్ట్రస్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్నవారు సంబంధిత సమావేశానికి రాకున్నా తీసుకున్న నిర్ణయాన్ని వారు అంగీకరించాలి. కమిటీలో ప్రతినిధులుగా ఉండే విత్తన సరఫరాదారులు సమావేశానికి రాకున్నా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందే
► విత్తన కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కఠినతరం చేస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement