టీఆర్‌ఎస్ అహంకారానికి చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక విధానాలు, ప్రజా ప్రతినిధులను బెదిరించడం, బ్లాక్‌మెయిల్ వంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టువంటివని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
స్థానిక సంస్థల కోటా నుంచి మూడు స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్‌పార్టీ రెండు స్థానాలను గెలుచుకుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్‌ఎస్ పార్టీ అన్ని అడ్డదారులను తొక్కి, అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విషసంస్కృతిని రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో విజయంకోసం అధికారపార్టీ అన్ని కుయుక్తులకు, కుట్రలకు పాల్పడిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం, రంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ స్థానాలు లేకున్నా ఎలా గెలిచిందో ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ గెలుపుకోసం వైఎస్సార్‌సీపీ పరోక్షంగా పనిచేందని ఆరోపించారు. నల్లగొండలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్‌నగర్‌లో గెలిచిన దామోదర్‌రెడ్డిని అభినందించారు.
హృదయంలో దాచుకున్నారు: జానా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులు, కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా స్థానిక సంస్థల ప్రతినిధులు ధర్మాన్ని హృదయంలో దాచుకున్నారని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు బలం లేకున్నా నల్లగొండలో చేయని ట్రిక్కులు, కుయుక్తులు లేవన్నారు. గెలుపుకోసం ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా టీఆర్‌ఎస్ చాలా అనైతిక పద్ధతులను అవలంభించిందని విమర్శించారు.
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభాలు పెట్టి, బంధుగణాలను అడ్డుగా పెట్టి టీఆర్‌ఎస్ విజయం కోసం ప్రయత్నాలు చేసిందన్నారు. బలం లేకున్నా గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికినవారు, డాంబికంగా పేలినవారు నల్లగొండలో కాంగ్రెస్ విజయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలని జానారెడ్డి సూచించారు. గెలుపోటములు సహజమని, అంతిమంగా ప్రజల పక్షాన పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. ‘తెలంగాణ ప్రజల కోరిక ప్రకారం రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.., కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు. విలీనం చేస్తామంటూ టీఆర్‌ఎస్ పార్టీ మాటతప్పింది. తెలంగాణ ఇస్తే మద్దతుగా ఉంటామన్న సంఘాలు కూడా తప్పించుకున్నాయి. అయినా కాంగ్రెస్‌పార్టీ వెనుకాడలేదు’ అని అన్నారు.
కాంగ్రెస్‌నే గెలిపించారు: షబ్బీర్
ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. నైతిక విలువలను వదిలేసి డబ్బు, అధికారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓటర్లతో మాట్లాడినా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించారని అన్నారు.