వ్రతం చెడినా దక్కని ‘ఫలితం’
దేవులపల్లి అమర్
వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న చందంగా మొన్నటి పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు వెలువడడంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక ఈ గిమ్మిక్కులతో లాభం లేదని మొత్తం పార్టీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేయబోతున్నారని వార్తలు వెలువడినాయి. దీనితో మంత్రులు, నాయకులు, శ్రేణులు కూడా గందరగోళంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన మార్పులను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే- కౌన్సిల్ ఫలితాలు అధికార పార్టీనీ, నాయకుడినీ పెద్ద షాక్కే గురి చేశాయి కాబట్టి.
తెలంగాణకు మారుపేరు టీఆర్ఎస్, సుదీర్ఘ పోరాటాల కారణంగా సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప మరొక పార్టీకి స్థానం లేదనీ, గులాబీ రంగు తప్ప మిగతా రంగులన్నింటినీ తెలంగాణ ప్రకృతిలో నుంచి తొలగిస్తామనీ ఈ పదినెలల కాలం ఉపన్యాసాలతో ఊదరగొట్టిన అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. గతవారం జరిగిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్కు మింగుడు పడకపోవడంలో ఆశ్చర్యం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహ బూబ్‌నగర్ జిల్లాలకు కలిపి ఉన్న నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, న్యాయవాది రామచందర్‌రావు సాధించిన ఆధిక్యం ఆ పార్టీ సహా, అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యచకితులను చేసింది. ఎందరినో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అధికార పార్టీకి మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. రామచందర్‌రావు సాధించిన ఆధిక్యం ఓ పక్క బాధపెడుతుం టే, మరో పక్క నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు కలిపి ఉన్న నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచిన తీరు కుంగ దీసింది.
ఏమిటీ అధిక ప్రసంగం?
ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రీ, ఆయన కుమారుడూ, ఇతర నాయ కులూ బోలెడు మాట్లాడారు. ప్రతిపక్షాలు లేనేలేవన్నారు. ముఖ్యమంత్రి మరింత ముందుకుపోయి బీజేపీకి ఓట్లు వేస్తే మోరీ (మురుగు కాలువ)లో వేసినట్టేనన్నారు. ఆయన కుమారుడు, కేటీ రామారావు తెలంగాణ ప్రజలకు పసుపు వర్ణం శుభసూచకమే కాదంటారు. అది తమకు గిట్టని తెలుగుదేశం జెండా రంగన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి అదే పసుపు జెండా నీడన ప్రచారం చేసి గెలిచారు మరి! సాధ్య మైతే సప్తవర్ణాలలో తమ పార్టీ జెండా రంగు గులాబీ లేదు కాబట్టి ఆ ఏడు రంగులనూ నిషేధిస్తాను అన్న ధోరణి ఆయనది. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే, నిజానికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టక ముందే పసుపు రంగు ఉందనీ, ఎరుపు రంగును కమ్యూనిస్టులు కనుగొనలేదనీ అలాగే గులాబీ రంగు చంద్రశేఖరరావు పరిశోధనలో బయటపడింది కాదనీ యువనాయకుడికి ఎవరు చెప్పాలి? ఈ వింత ధోరణి సుదీర్ఘ రాజకీయ భవి ష్యత్తు కలిగిన కేటీఆర్ వంటి యువనేతకు ఉండడం విచారకరం. పైగా రేపో మాపో పార్టీపగ్గాలు ఆయనకే అప్పగించనున్నారనే వార్త చలామణిలో ఉంది.
ఇక ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల విషయానికి వస్తే - ఫలితాలు వెలువడ్డాక అధికార పక్షీయుల మాట పడిపోయింది. ఫలితాల మీద స్పందిం చిన కొద్ది మంది, అభ్యర్థి దేవీప్రసాదరావు సహా, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఫలి తం అనడానికి లేదన్నారు. మొదట్లో చెప్పుకున్నట్టు, తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి స్థానం లేదని ఈ పదిమాసాలూ అధికార పార్టీ బెదిరించి, విపక్షాలను ఖాళీ చేసే పనిలో పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలను ఎన్నికలలో సాధించుకున్నప్పటికీ, సంతృప్తి చెందని అధికార పార్టీ, దాని అధిపతీ స్వయంగా వలసలను ప్రోత్స హించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను తమ పార్టీలోకి లాక్కున్నారు. నైతికత గురించి మాట్లా డిన వారిని తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేశారు. వారంతా బంగారు తెలం గాణ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి స్వచ్ఛందంగా చేరినవారేనని ప్రచారం చేశారు, ప్రకటనలు ఇప్పించారు.
ప్రక్షాళనే మార్గమా?
వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న చందంగా మొన్నటి పట్టభద్రుల నియోజక వర్గ ఫలితాలు వెలువడడంతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక ఈ గిమ్మిక్కులతో లాభం లేదని మొత్తం పార్టీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేయ బోతున్నారని వార్తలు వెలువడినాయి. దీనితో మంత్రులు, నాయకులు, శ్రేణు లు కూడా గందరగోళంలో పడ్డారు. ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన మార్పు లను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఎందుకంటే- కౌన్సిల్ ఫలితాలు అధికార పార్టీనీ, నాయకుడినీ పెద్ద షాక్కే గురి చేశాయి కాబట్టి. టీఆర్ఎస్ రంగంలో దింపిన ఇద్దరు అభ్యర్థులు చిన్నాచితకా నాయకులు కారు. దేవీప్రసాదరావు మలిదశ ఉద్యమంలో రాజకీయ జేఏసీలో కీలక నాయకుడు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలబడిన తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు. రెండవ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2014 ఎన్నికలలో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అధిష్టా నానికి అత్యంత సన్నిహితుడు. మొత్తం పార్టీ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పల్లాయే అధ్యక్షునిగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసేటంత సన్నిహితుడు. అంటే మొన్న కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసే నాటికి అధికార పార్టీ పెద్ద దిక్కు ఆయనే. అటువంటి ఇద్దరు ప్రముఖులను బరిలోకి దింపితే ఎదురైన ఫలితం చంద్రశేఖరరావును దిగ్భ్రాంతికి గురి చేయడంలో ఆశ్చర్యం ఏముంది? ఈ రెండు కౌన్సిల్ స్థానాలను గెలుచుకోవడానికి ఆయన ఎన్నెన్ని ప్రకటనలు చేశారు? ‘సెటిలర్’ అన్న పదమే తెలంగాణలో వినిపించడానికి వీలులేదని హఠాత్తుగా ప్రకటించినా అంతా నమ్మేస్తారని కూడా ఆయన అనుకున్నారు. అదీ జరగలేదు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఐదు గంటలు గడిపినా, రామా నాయుడి అంత్యక్రియలు అధికారికంగా జరిపించినా అందులో ఆ వర్గాల వారు చిత్తశుద్ధిని చూడలేదు.
ఓటమి వెనుక..
ఎదురేలేదని టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉన్న కాలంలో ఇటువంటి ఫలితం రావడానికి కారణం ఏమిటి? అందుకు బోలెడు కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు. మరీ దీర్ఘంగా కాకుండా ముఖ్యమైన కారణాలను చెప్పుకుందాం!
మొదటిదీ, ముఖ్యమైనదీ - మితిమీరిన ఆత్మ విశ్వాసం.
పార్టీలోనే జరిగిన అంతర్గత వెన్నుపోటు.
మాటలు తప్ప చేతలేమీ లేవన్న పట్టభద్రుల ఆగ్రహం (వీరిలో ఉపా ధ్యాయులు, నిరుద్యోగులు కూడా ఉన్నారు).
బీజేపీ ముందు నుంచే అభ్యర్థిని నిర్ణయించి ప్రచారం చేయడం.
అన్నింటికీ మించినది- అధికార పార్టీ సృష్టిస్తున్న గందరగోళం, దానితో బలౌతున్న నైతికత.
ఒకటి పోయినా మరొకటి గెలిచాం కదా అని అధికార పక్షం వాదించ వచ్చు. అది ఎటువంటి గెలుపో ఒకసారి సమీక్షించుకుంటే అర్థమవుతుంది. ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థను నడుపుతున్న నాయకత్వం ఆ పని ఇప్పటికే చేసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక నిర్దిష్టమైన లక్ష్య సాధన కోసం ఏర్పడిన పోరాట సంస్థ. అవసరం కాబట్టి రాజకీయ రూపం, నిర్మాణం సంత రించుకున్నది. లక్ష్యాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. సంపూర్ణ రాజకీయ పార్టీగా మారింది, కాబట్టి బలోపేతం కావలసిందే. కానీ గెలుపే పరమావధి, ఇంకో పార్టీని బతకనివ్వం అన్న ధోరణిని ప్రజాస్వామ్యంలో జనం మెచ్చరు. ఆ విషయాన్ని స్పష్టం చేయడానికే ప్రజలు ఈ ఫలితం ఇచ్చారు.
ముందున్నది ముసళ్ల పండుగ
అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఏదో రెండు కౌన్సిల్ స్థానాల ఎన్నికలే కదా అని ఊరుకోవడానికి వీలు లేదు. ముందున్నది ముసళ్ల పండుగ. కాం గ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన శాసన సభ్యుల స్థానాలకు ఏదో ఒకరోజు ఎన్నికలు జరగవలసిందే. అలాంటివి పది వరకు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నాక కడియం శ్రీహరి ప్రాతి నిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరపక తప్పదు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులను అడిగి చూడండి, ఈసారి ఏం చెయ్యబోతున్నారో! తుమ్మల నాగేశ్వరరావును మంత్రిగా కొనసాగిం చడానికి ఎక్కడి నుంచి గెలిపిస్తారో? నిన్నగాక మొన్న పలు కౌన్సిల్ స్థానాలు కూడా సభ్యుల పదవీకాలం పూర్తికావడంతో ఖాళీ అయ్యాయి. వీటన్నిటి కన్నా ముఖ్యమైనది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఓ పక్క హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది, ఎప్పుడు ఎన్నికలు పెడతారని! ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో ఎన్నిక వరం గల్ మునిసిపల్ కార్పొరేషన్. ఉద్యమకాలంలో రాజీనామాలు పడేసి మళ్లీ పోటీచేస్తే ప్రజలు గెలిపించారు, ఎన్నిసార్లయినా. రాష్ట్రం ఏర్పడుతున్న సం దర్భంలో జరిగిన తొలి ఎన్నికలలో సుదీర్ఘ పోరాటం చేసి సాధించినందుకు గెలిపించారు ప్రజలు. ఎల్లకాలం ఇదే విధంగా సాగుతుందని అధికార పక్షం భావిస్తే పప్పులో కాలేసినట్టే. అందుకు సంబంధించిన వ్యక్తీకరణే ఈ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు. కానీ, తెలంగాణ పున ర్నిర్మాణంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎన్నికలూ, వాటితో వచ్చే పదవులూ పరమార్థం కాదు.
datelinehyderabad@gmail.com