ఎమ్మెల్సీ ఫలితాలు కేసీఆర్‌కు చెంపపెట్టు
మాజీ మంత్రి డీకే అరుణ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఎమ్మెల్సీ ఫలితాలు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటివని, అధికారం ఉందని ఏ పని చేసినా చెల్లుబాటవుతుందన్న ఆయన ధోరణి ఈ ఎన్నికల ఫలితాలతోనైనా మారాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక చోట్ల టీఆర్‌ఎస్‌కు గెలిచే సత్తా, సంఖ్యా బలం లేకపోయినా నోట్లు పడేసి ఓట్లు కొనుగోలు చేయొచ్చని ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపారని, అయినా ధర్మమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయాన్ని నల్లగొండ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయన్నారు. అధికార బలంతో అన్ని పార్టీలను కాలరాయాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ఈ ఎన్నికల ద్వారా తిప్పికొట్టారన్నారు.