కళ్లు నెత్తికెక్కి ప్రతిపక్షాలను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులు సంస్కారహీనులని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు.
దమ్ముంటే 16 నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి: డీకే
మహబూబ్‌నగర్ అర్బన్: కళ్లు నెత్తికెక్కి ప్రతిపక్షాలను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులు సంస్కారహీనులని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వారి దురహంకారాన్ని చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమం పేరిట రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు.. అవినీతిలో కుబేరులను మించిపోయారని ఆరోపించారు. వాటర్‌గ్రిడ్‌లో డబ్బులు దండుకోవడానికే రూ.40 వేల కోట్ల పనులను ఆంధ్రప్రాంతం కాంట్రాక్టర్లకు అప్పజెప్పి తెలంగాణ వారికి మొండిచేయి చూపారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని, ఆయన కొడుకు, కూతురు, అల్లుళ్ల రాజ్యం నడుస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించమని ఆశావర్కర్లు కోరితే వారిపై తమ కార్యకర్తలు తిరగబడతారని ఓ మంత్రి హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. మంత్రులంతా అసమర్థులని విరుచుకుపడ్డారు. దమ్ముంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వ 16 నెలల పాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.