
పట్టభద్రుల బ్యాలెట్ పేపర్‌పై నినాదాలు
గ్రాడ్యుయేట్ ఓటర్ల అత్యుత్సాహం
బ్యాలెట్ పేపర్‌పై ఓ అభ్యర్థి ఫొటో చించి తీసుకెళ్లిన ఓ ఓటరు
ఇంకొందరు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర ప్రాధాన్యత ఓట్లు
25,824 ఓట్లు చెల్లుబాటుకానివిగా ప్రకటించిన ఎన్నికల అధికారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసే సమయంలో కొందరు అత్యుత్సాహంతో నినాదాలు రాయగా, ఇంకొందరు ఇతర అభ్యర్థుల ఫొటోలు నలిపేయడం, బ్యాలెట్ పేపరు వెనుక అంకెలు వేయడం, మరికొందరు ఐలవ్‌యూ అంటూ రాశారు.
చెల్లని ఓట్లు 7.69 శాతం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 7.69% ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 4, 63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 3,36,013 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొందరి అవగాహన రాహిత్యం, అత్యుత్సాహం కారణంగా 25, 824 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 3,10,189 చెల్లిన ఓట్లుగా అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్‌లో అధిక సంఖ్యలో చెల్లుబాటుకాని ఓట్లు బయటపడ్డాయి. కొందరు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయకుండా ఇతర ప్రాధాన్యత ఓట్లు వేయడం, టిక్కులు పెaట్టడం చేశారు.
బ్యాలెట్ పేపరుపై ఇష్టానుసారంగా రాతలు
బ్యాలెట్‌పేపర్లపై ప్రాధాన్యతక్రమంలో అంకెలు మాత్రమే వేయాలి. ఇతర ఎలాంటి రాతలు రాయొద్దని ఎన్నికల అధికారులు పలుమార్లు చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకుండా బ్యాలెట్ పేపర్లపై కొందరు జైమల్లన్న, జైరాకేశ్‌రెడ్డి అంటూ రాశారు. ఓ పట్టభద్రుడైతే బ్యాలెట్ పేపర్‌లో ఉన్న అభ్యర్థి ఫొటో కట్ చేసుకుపోయాడు. మరికొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ వెనుక అంకెలు వేయగా, మరికొందరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేశారు. కొందరు పట్టభద్రులు ఒక అడుగు ముందుకేసి ఐలవ్‌యూ అంటూ రాసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment