ప్రధాని సమీక్షలో వెల్లడి
గుర్తించిన వారిలో 94 శాతం
చిన్నారులకు వేశారని ప్రశంస
సాక్షి, హైదరాబాద్: రోగ నిరోధక టీకాలు సక్రమంగా అందని పిల్లలకు తిరిగి టీకాలన్నింటినీ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్ ఇంద్రధనుష్’ను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల లోపు పిల్లలకు పాక్షికంగా టీకాలు వేసినవారిని, అసలే వేయని వారిని సర్వే ద్వారా గుర్తించారు. అలాంటి వారిలో 94 శాతం మందికి మళ్లీ టీకాలు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పథకాల సమీక్షలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ ‘ఇంద్రధనుష్’లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచినట్లు ప్రకటించారని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) తెలంగాణ రాష్ట్ర చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం మూడు అంశాల ఆధారంగా ఈ స్థానాన్ని ప్రకటించారన్నారు. పిల్లలను గుర్తించడంలో సూక్ష్మస్థాయి కార్యాచరణ ప్రణాళికను 97 శాతం అమలుచేయడం, నూటికి నూరు శాతం ప్రచారం నిర్వహించడం, గుర్తించిన వారిలో 94 శాతం మంది పిల్లలకు టీకాలు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
‘మిషన్ ఇంద్రధనుష్’ కార్యక్రమం అమలు అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 90.90 శాతం మంది పిల్లలు పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకున్నట్లు వెల్లడైందని వివరించారు. ఈ పథకంలో పిల్లలకు హెపటైటిస్-బి, పోలియో, బీసీజీ, పెంటావాలెంట్ (ఇందులో ఐదు రకాల టీకాలు వేస్తారు), తట్టు, ధనుర్వాతం, కోరింత దగ్గులకు ప్రత్యేకంగా టీకాలు వేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అమలులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అందులో పాల్గొన్న అధికారులను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు.
‘మిషన్ ఇంద్రధనుష్’లో తెలంగాణ నంబర్ 1
Published Thu, Feb 18 2016 12:37 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement