
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, టీఆర్‌ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేష్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరంను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో గిరిజనులు హాజరవుతారని వివరించారు.
సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిందని వివరించారు. ఉత్తర భారతంలో జరిగే వనజ్ జాతరను జాతీయ పండుగగా గుర్తించినట్టే గిరిజనులు ఎంతో ఆరాధించే సమ్మక్క–సారలమ్మ జాతరను సైతం జాతీయ పండుగగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సాయం చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరినట్టు సమావేశం అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అలాగే జాతరకు రావాల్సిందిగా మంత్రి జుయల్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment