చలిః11.2
చలిమంట
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
మూడేళ్ల అనంతరం మళ్లీ అత్యల్పం
వచ్చేవారం రోజులూ మరింత గజగజ
సిటీబ్యూరో: ‘గ్రేటర్’ చలి కౌగిలిలో చిక్కుకుంటోంది. శీతల గాలులు వణికించేస్తున్నాయి. నగరం రోజురోజుకూ చల్లగా మారిపోతోంది. రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలూ మరింతగా పడిపోతున్నాయి. శని వారం తెల్లవారుజామున నగరంలో 11.2, పగటి వేళ 27.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శుక్రవారం రాత్రి 14.7 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు 24 గంటలు గడిచేసరికి 11.3కు పడిపోయాయి. దీనికి తోడు ఉత్తర ఈశాన్యగాలుల ప్రభావంతో శనివారం రోజంతా చలిగాలుల తీవ్రత కొనసాగింది.
మూడేళ్లలో అత్యల్పం
2010వ సంవత్సరం (11.4 డిగ్రీలు) తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు శనివారమే నమోదయ్యాయి. ఆదివారం నుంచి మరో వారం రోజుల పాటు మరో డిగ్రీ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో 1966 డిసెంబర్‌లో 7.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్. అనంతరం 2010లో 8.9 డిగ్రీలు, 2009లో 11.2 డిగ్రీలు, 2005లో 8.7 డిగ్రీలు, 2004లో 10.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.