మున్సిపల్ అధికారులకూ ఆ బాధ్యతలు..
అభ్యంతరకర ప్రకటనల తొలగింపు అధికారాలిచ్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో అభ్యంతరకర ప్రకటనల తొలగింపు బాధ్యతలను మున్సిపల్ శాఖ అధికారులకు ప్రభుత్వం కట్టబెట్టింది. బహిరంగ ప్రదేశాల వికృతీ కరణ నిర్మూలన, అభ్యంతరకర ప్రకటనల నిషేధ చట్టం ప్రకారం అభ్యంతరకర ప్రకటనలను తొలగించే అధికారం పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ఉండగా.. మున్సిపల్ కమిషనర్లు, ఇతర మున్సిపల్ అధికారులకూ వర్తింపజేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్, డిçప్యూటీ కమిష నర్, చీఫ్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, సానిటరీ సూపర్‌వైజర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లకు ఈ ప్రకటనల తొలగింపు అధికారం ఉంటుందని తెలిపింది.
► మున్సిపాలిటీల్లో కమిషనర్‌తోపాటు టౌన్ ప్లానింగ్ అధికారి, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, టైన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్లకు ప్రకటనల తొలగింపు అధికారం ఉండనుంది.
► నగర పంచాయతీల్లో మున్సిపల్ కమిషనర్లకు మాత్రమే అధికారం ఉంటుంది.