పురోహితుని ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై సాక్షి’లో వస్తున్న వరుస కథనాలతో స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ ఫేజ్-2 కు చెందిన శ్రీనివాసాచార్యులు కుమారుడు భాస్కర కృష్ణ స్వరూప్ (భాస్కరాచార్యులు) స్థానిక మహిళతో చనువుగా ఉంటున్నాడని కాలనీవాసులు చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈనెల 11న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారన్న పుకార్లు షికార్లు చేయడంతో పాటు పురోహితుని ప్రాణానికిరూ.5 లక్షలు వెల కట్టడంపై సాక్షి’ గురువారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భాస్కరకృష్ణను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై మెహర్‌సాయి హైస్కూల్ అధినేత విజయభాస్కరరాజు, కృష్ణం నాయుడు, సంజీవయ్య, రామకృష్ణ, సత్యనారాయణ, రాంరెడ్డిలను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.