ముగిసిన ‘క్రమబద్ధీకరణ’!
చివరి రోజు పెరిగిన రుసుం చెల్లింపులు
మూడు పర్యాయాలు గడువు పెంచినా స్పందన అంతంతే
మరో రెండు నెలల గడువు కోసం ప్రతిపాదనలు
సిటీబ్యూరో : ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్ధీకరించుకునేందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నోటీసు అందుకున్న వారు బ్యాంక్‌లో ఈ-చలాన్ చెల్లించేందుకు బారులు తీరారు. ప్రభుత్వం మూడు పర్యాయాలు గడువు పెంచినా క్రమబద్ధీకరణ అంతంత మాత్రంగానే కొనసాగింది. మరోవైపు కొత్త దరఖాస్తులకు అవకాశం, రుసుం చెల్లింపులో వెసులుబాటుపై పేద ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు రావడంతో...మరో రెండు మాసాలు గడువు పెంచాలని హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వాస్తవంగా 59 జీవో కింద 956 దరఖాస్తులు రాగా అందులో కేవలం 387 మాత్రమే అర్హత సాధించారుు. మరోవైపు జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న సుమారు 4,841 దరఖాస్తులు సర్వే నివేదికల ఆధారంగా 59 జీవో కిందకు మార్చారు. దీంతో పేదలపై ఆర్థిక భారం పడినట్లరుుంది. అధికారులు డోర్ టూ డోర్ విచారణ జరిపి ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమతపై నివేదిక సమర్పించడంతో కేటగిరి మార్పు తప్ప లేదు. ముఖ్యంగా అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, షేక్‌పేట, ఖైరతాబాద్, గోల్కొండ, మారేడుపల్లి తదితర మండలాలలోని ఆక్రమిత ఇళ్ల కేటగిరిలో మార్పు చోటుచేసుకుంది. దీంతో కేటగిరి మారిన వారు క్రమబద్ధీకరణ కోసం రుసుం చెల్లించేందుకు పెద్దగా అసక్తి కనబర్చనట్లు తెలుస్తోంది.
నోటీసులకు స్పందన కరవు
జిల్లా యంత్రాంగం ఆక్రమిత ఇళ్ల భూ క్రమబద్ధీకరణ కోసం అర్హులైన దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన కరువైంది. మొత్తం మీద 3,647 మంది దరఖాస్తు దారులకు నోటీసులు జారీ చేస్తే..100 శాతం రుసుం చెల్లించిన వారు 590 మందికి మించలేదు. 59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న 150 మందికి, 58 నుంచి 59 కేటగిరిలోకి మార్పు చెందిన 3,311 కుటుంబాలకు నోటీసు జారీ చేసినా..కొద్ది మంది మాత్రమే రుసుం చెల్లించేందుకు ముందుకు వచ్చారు.
జీవో 92కు కూడా అంతంతే..
జీవో నంబర్ 92 కింద స్పందన అంతంత మాత్రంగానే మారింది. గడువు పెంపు అనంతరం కేవలం 148 మంది మాత్రమే రుసుం చెల్లించినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నారుు. అధికారులు సుమారు 372 మందికి నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోరుుంది.