వాస్తవాలను కళ్లకు కట్టే.. వీడియో జర్నలిస్ట్ | The facts showed ..Video journalist | Sakshi
Sakshi News home page

వాస్తవాలను కళ్లకు కట్టే.. వీడియో జర్నలిస్ట్

Published Sun, Jul 27 2014 12:13 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

వాస్తవాలను కళ్లకు కట్టే..  వీడియో జర్నలిస్ట్ - Sakshi

వాస్తవాలను కళ్లకు కట్టే.. వీడియో జర్నలిస్ట్

సమాజానికి కళ్లు, చెవులు.. మీడియా.  మాటల కంటే దృశ్యాలే ఆయువుపట్టుగా ఉండే టీవీ ఛానళ్లలో కీలకమైన ఉద్యోగులు.. వీడియో జర్నలిస్ట్‌లు. మనదేశంలో అన్ని భాషల్లో వార్తా ఛానళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో డిమాండ్ అధికమవుతున్న కెరీర్.. వీడియో జర్నలిజం. సమాజానికి మేలు చేయాలన్న తపన  కలిగి, సవాళ్లను ఇష్టపడే నేటి యువతకు అనువైన కొలువు.. వీడియో జర్నలిస్ట్.
 
అవకాశాలకు ఢోకా లేదు : భారత్‌లో వీడియో జర్నలిస్ట్‌లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొత్త ఛానళ్లు వస్తుండడంతో వీరికి డిమాండ్ పెరుగుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే.. అవకాశాలకు కొదవ ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రతిభ, అనుభవం కలిగినవారికి ఎంతైనా చెల్లించేందుకు జాతీయ ఛానళ్లు ముందుకొస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్‌ల ప్రధాన బాధ్యత.. దృశ్యాలను, డాక్యుమెంటరీలను చిత్రీకరించి, ఛానళ్లకు ఇవ్వాలి. ఈ రంగంలో అడుగుపెడితే ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. కొత్త వ్యక్తులతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. కొత్త ప్రాంతాలను చూసే అవకాశాలు లభిస్తాయి.  
సవాళ్లు, ఇబ్బందులు:  
 
ఈ రంగంలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయి. ప్రజల మధ్య క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి సుదీర్ఘ ప్రయాణాలు తప్పవు. అల్లర్లను చిత్రీకరించేటప్పుడు గాయాల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. సమాజంలో వార్తలను పసిగట్టగల నైపుణ్యం ఉండాలి. బరువైన కెమెరాలను గంటలతరబడి మోయాల్సి ఉంటుంది.  పనివేళలతో సంబంధం లేకుండా అవసరాన్ని బట్టి పగలూరాత్రి విధులు నిర్వర్తించాలి. వీడియో జర్నలిస్ట్‌లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి.
   
అర్హతలు
: గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కెమెరా జర్నలిస్ట్ కోర్సులో చేరాలి. కెమెరా వినియోగం, జర్నలిజంపై శిక్షణ పొంది, స్థానిక వార్తా ఛానళ్లలో ట్రైనీగా చేరొచ్చు. అక్కడ తగిన అనుభవం సంపాదించి పేరున్న ఛానళ్లలో పూర్తిస్థాయి వీడియో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.   
 
వేతనాలు: వీడియో జర్నలిస్ట్‌గా వృత్తిలోకి అడుగుపెట్టిన ఫ్రెషర్లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం ఉంటుంది. కనీసం ఐదారేళ్ల  అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేలకు పైగా అందుకోవచ్చు. ఛానల్ స్థాయిని బట్టి వేతనం లభిస్తుంది. లోకల్ ఛానళ్లలో ఎక్కువ వేతనాలు ఉండవు. జాతీయ ఛానళ్లలో అయితే ప్రతిభావంతులకు నెలకు లక్ష రూపాయలకు పైగానే అందుతుంది.   
 
వీడియో జర్నలిస్ట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఫైన్‌ఆర్ట్స్
 ఆసియన్ కాలేజీ ఆఫ్ జర్నలిజం.

 సృజనాత్మకతతో ఉజ్వల భవిత

 ‘‘వైవిధ్యంగా ఆలోచించే యువతకు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  మీడియా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో అవకాశాలకు కొదవలేదు. వీడియో జర్నలిస్టులూ దానిలో భాగమే. శిక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం చేరడంతో కెరీర్‌లో బహుముఖంగా ఎదిగేందుకు వీలుంది. టీవీ ఛానళ్లలో భారీగా అవకాశాలు దక్కుతున్నాయి. క్రియేటివిటీ ఆధారంగా వేతనం లభిస్తుంది’’

 -రేవతి దేవీమాధుర్, ఇన్‌ఛార్జి,
 ఆర్ట్స్‌గ్రూప్స్, విల్లామేరీ కళాశాల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement